నెల రోజుల్లోపు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కొండ పోచమ్మ జలాశయానికి రానున్నాయని ఇది గజ్వేల్ ప్రజలకు వరం అన్నారు మంత్రి హరీశ్ రావు. ఎండాకాలంలో చెరువులు, కుంటలు నింపుకుంటాం… తొందరగా నాట్లు వేసుకునేందుకు రైతన్నలు సిద్ధం కావాలన్నారు.
సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన వర్గల్‌లో బుధవారం ఉదయం రూ.2.60కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కొత్త కుంట చెరువును ప్రారంభించారు. రూ.4.27కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఖాన్ చెరువు పునరుద్ధరణ-సుందరీకరణ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు హరీశ్ రావు.
కొత్త కుంట చెరువు పునరుద్ధరణ-సుందరీకరణతో వర్గల్ సరస్వతీ దేవాలయానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యం అన్నారు. 66 ఎకరాల ఆయకట్టుతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జెట్టి సౌకర్యం కల్పిస్తున్నాం. మిషన్ కాకతీయ కింద ఫీడర్ ఛానల్ బాగుతో పంట కాలువలు, చెరువులు, బతుకమ్మ మెట్లు అభివృద్ధి పనులు చేపట్టనున్నాం అన్నారు.
గతంలో 3 మీటర్ల మేర బండ్ ను 10 మీటర్ల మేర వెడల్పు చేపడుతాం… రూ.4.27కోట్ల రూపాయలతో ఖాన్ చెరువు పునరుద్ధరణ- సుందరీకరణతో 600 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వనరు రానుందన్నారు. త్వరలోనే రానున్న కాళేశ్వరం జలాలతో కొత్త కుంట, ఖాన్ చెరువు ప్రాంతంలో 3వేల క్యూసెక్కుల నీళ్లు రానున్నాయన్నారు. అలాగే హల్దీ వాగుపై ఉన్న 12 చెక్ డ్యామ్ లు నింపుతాం. 2900 ఎకరాల మేర మేలు చేకూరనున్న హల్దీ ప్రాజెక్టుకు, హల్దీ ప్రాజెక్టు పై ఉన్న 12 చెక్ డ్యామ్ లకు, ఘణపురం, బొల్లారం మత్తడి దూకే ప్రాంతాలకు సాగునీటి వనరులు వస్తాయని చెప్పారు.
వచ్చే వాన కాలంలోపు యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఆదేశించారు. నాచగిరి శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి దేవాలయ ఆవరణలో చెక్ డ్యామ్ 45 రోజుల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశిస్తూ….త్వరలోనే నాచగిరిని సందర్శించనున్నట్లు మంత్రి వెల్లడించారు. వర్గల్ లోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ ను సరస్వతీ దేవాలయానికి వేలాది మంది భక్తులు భారీగా తరలివస్తున్న క్రమంలో దేవాలయానికి అప్పగించాలని అధికారులకు మంత్రి సూచించారు.

