ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. మొన్న రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి-2 లీకైన విషయం వెలుగులోకి రాగా….తాజాగా కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఓం నమో వెంకటేశాయ లీకైనట్లు పోలీసులు గుర్తించారు. బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమా క్లిప్పింగ్స్ చోరీ చేసి షేర్ చేసుకున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో కీలక విషయాన్ని గుర్తించారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా రూపొందుతున్న నాగార్జున చిత్రం ‘ఓం నమోవెంకటేశాయ’కు చెందిన కొన్ని సీన్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని విజయవాడ ఏసీపీలు సత్యానందం, మురళీధర్ లు వెల్లడించారు.
అయితే ఈ దృశ్యాలు ఎవరికీ షేర్ చేయలేదని తెలిసింది. విజయవాడలోని సెంట్రల్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ సత్యానందం, టాస్క్ఫోర్సు ఏసీపీ మురళీధర్‌లు బుధవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు.’ఓం నమోవెంకటేశాయ’ సీన్లను ఎక్కడి నుంచి తెచ్చారన్న విషయం తెలియాల్సివుంది.
బహుబలి-2 సినిమా క్లిప్పింగ్స్‌ను ఎడిటింగ్ విభాగంలో పని చేస్తున్న కృష్ణదయానంద్ డౌన్లోడ్ చేసుకుని… తన స్నేహితుడు అయిన అక్కి కృష్ణచైతన్యకు పంపించాడు. కృష్ణచైతన్య ఆ క్లిప్పింగ్‌ను తన ఇద్దరు స్నేహితులైన బీకాం విద్యార్థులు నూరుద్దీన, సర్వోత్తమ్లకు షేర్ చేశారు. వారు తమ స్నేహితులైన బీటెక్ విద్యార్థులు పార్థూ శ్రీను, సాయి సుదర్శనలకు పంపించారు. కృష్ణ దయానంద్తోపాటు ఆరుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.