హీరో నాగార్జున కుమారుడు అఖిల్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘హలో’ ఈ శుక్రవారం నాడు వెండితెరలను తాకనున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నాగార్జున, సినిమా స్టోరీని రెండు లైన్లలో చెప్పేశారు. ఓ ఇంటర్వ్యూ లో ఆయన, ఈ చిత్రం రొమాంటిక్ అడ్వెంచర్ చిత్రమని, ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు. చిన్న తనంలోనే విడిపోయిన తన సోల్ మేట్ కోసం 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఓ యువకుడికి, ఓ ఫోన్ ఆధారంగా ఆమె గురించి తెలుస్తుందని, ఆపై ఆ ఫోన్ పోతుందని చెప్పిన నాగార్జున, తన ప్రేయసిని వెతుకుతూ ఆ యువకుడు చేసే ప్రయాణం, ఎదురైన అనుభవాలు, చివరకు ఏం జరిగిందన్నది చిత్ర కథనమని అన్నారు.
సింగిల్ లైన్ స్టోరీ అయినా, స్క్రీన్ ప్లే అద్భుతమని, విక్రమ్ సినిమాల్లో ఉండే మేజిక్ ఇందులోనూ ఉంటుందని చెప్పారు. దాదాపు 60 వరకూ టైటిల్స్ అనుకున్నామని, ఓ రోజు అనుకోకుండా ‘హలో’ అని తట్టడంతో, వెంటనే అందరికీ చెప్పి, అన్ని భాషల్లోనూ రిజిస్టర్ చేయించానని నాగ్ వెల్లడించారు. ఈ సినిమాలో అఖిల్ తల్లిగా రమ్యకృష్ణ చక్కగా నటించారని, మంచి కథ వచ్చినప్పుడు తాను అఖిల్ తో కలసి కచ్చితంగా ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తానని అన్నారు.