నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. సీఎం కేసీఆర్ స్వయంగా సాగర్ ఉప ఎన్నికలపై ఫోకస్ పెడుతుండడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా కదను తొక్కుతున్నాయి. మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి టీఆర్ఎస్ మంత్రులు, బాల్కసుమన్, కోనేరు కోనప్ప, శంకర్‌నాయక్ వంటి ఎమ్మెల్యేలు, ఇతర అగ్రనేతలు నోముల భగత్‌ను గెలిపించేందుకు అహర్నిశలుశ్రమిస్తున్నారు. సాగర్ నియోజకవర్గంలోని 7 మండలాలలో ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలతో కలిసి ఊరూరా తిరుగుతూ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.
7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా… 4 సార్లు మంత్రిగా పని చేసినా జానారెడ్డి నల్గొండ జిల్లా ప్రజలకు కనీసం చుక్క నీరు కూడా అందించలేకపోయారని, సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధిలో వెనక్కి నెట్టేసారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. గత ఏడేళ్లలో టీఆర్ఎస్ హయాంలో సాగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని, ప్రజలకు సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ..దివంగత ఎమ్మెల్యే నోములకు నివాళిగా ఆయన కుమారుడు భగత్‌కే ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కుట్ర చేస్తున్న బీజేపీ ఓట్ల కోసం అదే సామాజికవర్గానికి చెందిన రవినాయక్‌ను టికెట్ ఇచ్చిన విషయాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. టీఆర్ఎస్ నాయకుల ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంటోంది.
ఈ నేపథ్యంలో సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి భగత్ 35వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తాజాగా త్రిపురారం మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించింన మంత్రి తలసాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పధకాలతో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ప్రజలంతా డిసైడ్ అయ్యారని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రజల పార్టీ, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. నోముల భగత్ ఒంటరి కాదు, ముఖ్యమంత్రి, ప్రభుత్వం తన వెంట ఉందన్నారు. మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నాము. రైతులకు ఎకరానికి 10వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు తెలిపారు.అన్నివర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న టీఆర్‌ఎస్ వైపే ప్రజలు ఉన్నారని తెలిపారు. మొత్తంగా సాగర్ ఉప ఎన్నికల సరళిని చూస్తే తలసాని చెప్పినట్లు నోముల భగత్ 35 వేల భారీ మెజారిటీతో గెలుస్తారని, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇక రాజకీయాల నుంచి పర్మినెంట్‌గా తప్పుకోవడం ఖాయమని, బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కడం కూడా డౌటే అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి తలసాని వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.