తెరపైనే కాదు.. నిజజీవితంలోనూ ఆదర్శజంటగా పేరు తెచ్చుకున్నారు. ఆన్సెట్స్ ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ పరిమళించి పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్లింది. అటుపై ఆదర్శవంతమైన సంసార జీవితాన్ని సాగించి నవతరానికి ఆదర్శమయ్యారు అమల, నాగార్జున. ఇప్పటికే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటై 25 వసంతాలు పూర్తయింది. ఈ సంధర్బంగా నాగార్జున తమ పెళ్లినాటి ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘నేటికి 25 ఏళ్లు అవుతోంది’ అంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అమల, నాగార్జున తెలుగులో ప్రేమ యుద్ధం, చినబాబు, కిరాయి దాదా, శివ, నిర్ణయం తదితర చిత్రాల్లో నటించారు.
రామ్‌పాల్ వర్మ దర్శకత్వంలో శివ చిత్రంలో తొలిసారి జోడీగా నటించిన ఈ జంట…వర్మ దర్శకత్వంలోనే నిర్ణయం చిత్రంలో నటించారు. ఆ రెండు సినిమాల వల్లే ఈ ప్రేమ సాధ్యమైంది. అటుపై 11 జూన్ 1992లో పెళ్లితో ఒకటయ్యారు. నాగార్జున-అమల ప్రేమకథ గురించి తెలిసినవారు కొన్ని ఆసక్తికర సంగతులు చెబుతుంటారు. ఈ ఇద్దరూ ఆన్సెట్స్ పనిచేసేప్పుడు ఒకరిగురించి ఒకరు తెలుసుకున్నారు. కాలక్రమేణా అభిరుచులు కలిశాయి. బంధం ముడిపడిందని చెబుతారు.
పెళ్లయి ఇంతకాలమైనా ఐదు పదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ కపుల్గా అలరిస్తున్న ఈ జంట నిజంగానే ఆదర్శ జంట. నిత్యం ఆరోగ్య సూత్రాల్ని అనుసరిస్తూ ఆహ్లదకరమైన జీవితాన్ని సాగించడం వల్లే నిత్యయవ్వనంతో ఉన్నారన్నది కాదనలేని వాస్తవం. ఆ రకంగా ఈ జంట అందరికీ ఆదర్శం. వివాహమయ్యాక అమల సినిమాలకు దూరమయ్యారు. చాలా కాలం తర్వాత ఆమె 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో నటించారు ప్రస్తుతం నాగార్జున ‘రాజుగారి గది-2’ చిత్రంలో నటిస్తున్నారు.