నాగబాబు @ ది రియల్ యోగి

84
- Advertisement -

‘ది రియల్ యోగి’ పుస్తకాన్ని ఒక కామన్ పాయింట్ అఫ్ వ్యూలో కళ్యాణ్ బాబు గురించి రచయిత గణ అద్భుతంగా రాశారు. కళ్యాణ్ బాబు గురించి నేను ఏం అనుకుంటానో దగ్గరదగ్గరగా అలానే రాశాడు గణ. అందుకే ఈ పుసక్తం ఇంకా నచ్చింది” అన్నారు మెగా బ్రదర్ నాగబాబు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యువ రచయిత గణ రాసిన ‘ది రియల్ యోగి’ బుక్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మెగా బ్రదర్ నాగబాబు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, బాబీ కొల్లి, తనికెళ్ళ భరణి, పుస్తక రచయిత గణ, శ్రీకాంత్ రిష, సాహి సురేష్ శైలా తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. ‘ది రియల్ యోగి’ పుస్తకాన్ని చదివాను. రచయిత గణకి అభినందనలు. ఈ పుస్తకం ఏకబిగిన చదించింది. శ్రీకాంత్రిష అద్భుతమైన చిత్రాలు గీశారు. గణ అద్భుతంగా రాశారు. తెలుగులో ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఒక కామన్ పాయింట్ అఫ్ వ్యూలో కళ్యాణ్ బాబు గురించి గణ అద్భుతంగా రాశారు. కళ్యాణ్ బాబు గురించి నేను ఏం అనుకుంటానో దగ్గరదగ్గరగా అలానే రాశాడు గణ. అందుకే ఈ పుసక్తం ఇంకా నచ్చింది. కళ్యాణ్ బాబు గ్రేట్ మోటీవెటర్. తన దగ్గర వున్నది ఇచ్చేయడమే కళ్యాణ్ బాబుకి తెలుసు. కళ్యాణ్ బాబు ఆలోచన ధోరణి చిన్నప్పటి నుండే భిన్నంగా వుండేది. సినిమాలకి రాకముందే కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నావని అన్నయ్య అడిగితే ” క్యాలిటీగా వుండే సినిమాలు ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చాలు” అన్నాడు. తను హీరో అయిన తర్వాత కూడా ఇదే పాటిస్తున్నాడు. ఎదుటి వాడి బాధలో వుంటే తను హాయిగా ఉండలేడు. రుద్రవీణ అన్నయ్య చేసిన సూర్యం పాత్ర రియల్ లైఫ్ లో కళ్యాణ్ బాబుది. ‘సంపాదన నాకు తృప్తిని ఇవ్వడం లేదు. ఎదుటి వాడు బాధలో వుంటే నేను సంతోషంగా ఉండలేను’ అని కామన్ మాన్ ప్రొటక్షన్ ఫోర్స్ పెట్టినపుడే చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడో ఇప్పుడూ అదే చెబుతున్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే వున్నాడు. మరో నాలుగు నలఫై ఏళ్ల తర్వాత కూడా అలానే ఉంటాడు.. దటీజ్.. పవన్ కళ్యాణ్. తన జీవితం పూలపాన్పు కాదు. తను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు. లంచగొండి తనంతో సామాన్యుడిని ఇబ్బంది పెడుతున్న రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న అవినీతి, లంచగొండి రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయడానికి జనసేన పార్టీ పెట్టాడు. పైసా కూడా లేకుండా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడిపోయే వ్యక్తిత్వం కళ్యాణ్ బాబుది. తన భవిష్యత్ గురించి ఆలోచన వుండదు. ఇవన్నీ ఒక యోగి, మానవుని ఉండాల్సిన లక్షణమా అనవసరం. ఒక మనిషి కళ్యాణ్ బాబు నాకు చాలా నచ్చుతాడు. కళ్యాణ్ బాబులా వుండాలి కదా.. కానీ నేను అలా ఉండలేకపోతున్నానని చాలాసార్లు అనుకుంటాను. తన పిల్లల పై వున్న ఫిక్సడ్ డిపాజిట్లు అన్నీ తీసేసి జనసేన పార్టీ పెట్టాడు. ప్రజలందరికీ పెద్ద ఎత్తున సేవ చేయాలని రాజకీయాన్ని వేదికగా ఎంచుకున్నాడు. తెలుగులో తను టాప్ హీరో. ఫైనాన్సియల్ గా చూస్తే ఏమీ లేదు. కానీ ఒక మనిషిగా ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉంటాడు. ఈ పుస్తకంలో గణ, కళ్యాణ్ బాబుని ఎక్కడా గాడ్లీ పర్శన్ గా హైలట్ చేయడానికి ప్రయత్నించలేదు. ఈ పుస్తకం ఎంత హిట్ అవుతుందో లేదో తెలీదు కానీ .. అందరూ ఒకసారి చదవాల్సిన పుస్తకం ఇది” అన్నారు.

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ఎంతో అభిమానం, ప్రేమ వుంటే తప్పితే ఒక వ్యక్తిగురించి ఇలాంటి పుస్తకం రాయలేం. ఈ పుస్తకం రాసిన గణ, పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కూడా కలుసుకోలేదు. పవన్ కళ్యాణ్ కి భక్తులు వుంటారు. అలాంటి భక్తుడి హృదయం నుండి పుట్టిన పుసక్తం ఇది. పవన్ కళ్యాణ్ నేను కలుసుకుంటే పుస్తకాల గురించే మాట్లాడుకుంటాం. ఈ కార్యక్రమం జరగడానికి ప్రధాన సూత్రధారి మెహర్ రమేష్. గణ , మెహర్ రమేష్ కి రుణపడి వుండాలి. చివరికిగా ఒక మాట.. పవన్ అంటే గాలి. అతను కొంతమందికి చల్లగాలి, కొంతమందికి పిల్లగాలి, కొంతమందికి ప్రభంజనం.. అందరికీ ఆక్సిజన్” అన్నారు.

పుస్తక రచయిత గణ మాట్లాడుతూ.. నా పేరు గణ. రియల్ యోగి పుస్తక రచయితని. నేను పవన్ కళ్యాణ్ కులానికి కానీ తన ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని కాదు. తన పార్టీలో సభ్యత్వం లేదు. తనతో ఏ మాత్రం సంబంధం లేకుండా బయటనుండి స్వచ్చంగా ఆయన చెప్పిన మాటలు ”నీకు నాకు రెండు గుండెలు దూరం’ అని నమ్మి ఈ పుస్తకం రాశాను. పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే లక్షల మంది మధ్యలో వున్న ఎప్పుడూ వంటరిగా వున్నారేమో అనిపించేది. ”మిత్రమా.. నువ్వు వంటరివాడివి కాదు. నీ స్ఫూర్తి చచ్చిపోదు. నీ రక్తం వృదా కాదు. ఎక్కడో దూరం నుండి నిన్ను ప్రేమించే వ్యక్తులు చాలా మంది వున్నారు. ఈ పుస్తకమే దానికి సాక్ష్యం” అని ఈ వేదికగా తెలియజేస్తున్నా. ఈ పుస్తకం కోసం రిష అద్భుతమైన వర్క్ చేశారు. మెహర్ రమేష్ గారు అద్భుతమైన వ్యక్తి. ఆయన సహకారం వలనే ఈ ఈవెంట్ జరిగింది. ఆయనకి రుణపడి వుంటాను. నాగబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అందరూ ఈ పుస్తకం చదవాలి” అని కోరారు

మొహర్ రమేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ లో ఒక యోగిని చూసి ఈ పుస్తకాన్ని చాలా అద్భుతంగా ప్రజంట్ చేశారు గణ. శ్రీకాంత్ రిష చక్కని చిత్రాలు వేశారు. గణ, కళ్యాణ్ గారిని ఎప్పుడూ కలవలేదు. కేవలం ఆయన మీద అభిమానంతో రాశాడు. తన సొంత డబ్బులని ఖర్చు చేశాడు. కేవలం నాగబాబు గారి లాంచ్ చేయించండని మాత్రమే కోరాడు. తన సంకల్పం చాలా గొప్పది. కళ్యాణ్ బాబుగారికి చాలా దగ్గరగా రాశాడు. త్రివిక్రమ్, హరీష్ శంకర్, సత్యనంద్ అందరికీ ఈ పుస్తకం పంపించాం. చాలా బావుంది. అందరికీ రీచ్అయ్యేలా చూడామని చెప్పారు. ఈ ఈవెంట్ కి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు” తెలిపారు

బాబీ కొల్లి మాట్లాడుతూ.. ఇలాంటి పుస్తకం రాయాలంటే నిజాయితీ కావాలి. గణలో నిజాయితీ వుంది కాబట్టే ఇంత ధైర్యంగా రాయగలిగాడు. పవన్ కళ్యాణ్ గారి వున్న స్టార్ డమ్ తో అద్భుతంగా బ్రతకగలరు. కానీ ఇంత గొప్ప జీవితాన్ని పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలని నిరంతరం పోరాటం చేస్తున్నారు. రచయిత గణకి చిత్రాలు వేసిన శ్రీకాంత్ రిషకి అభినందనలు” తెలిపారు.శైలా తాళ్లూరి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు రియల్ యోగి. పవన్ కళ్యాణ్ గారు గొప్ప స్ఫూర్తి ప్రదాత. గణ చాలా అద్భుతంగా రాశారు. గణ కి అభినందనలు” తెలిపారు.సాహి సురేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారికి వున్న కోట్లాది మంది అభిమానుల్లో నేనూ ఒకడ్ని. ఒక భక్తుడిగా నావంతుగా ఈ బుక్ ని పది వేల మందికి రీచ్ అయ్యేలా ముందుకు తీసుకెళ్తాను” అన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -