రివ్యూ: నాంది

75
Allari Naresh

కామెడీ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్.. ఈ హీరో తాజాగా నటించిన సినిమా ‘నాంది’. నరేష్ గత సినిమాలతో పోలిస్తే భిన్నంగా సీరియస్‌గా కనిపించిన ఈ సినిమా ప్రోమోలతో ఆకట్టుకుంది. విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు రూపొందించిన ‘నాంది’ సినిమాగా ఏ మేర మెప్పించిందో చూద్దాం పదండి.

సూర్యప్రకాష్‌(నరేష్‌) ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అతడు తల్లిదండ్రులతో సంతోషంగా జీవిస్తుంటాడు. తాను ప్రేమించిన అమ్మాయి మీనాక్షిని(వనిత) పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని కలలు కంటుంటాడు. పేదల తరఫున పోరాడే లాయర్‌ రాజ్‌గోపాల్‌ హత్యకు గురవుతాడు. ఆ హత్యనేరంలో సూర్యప్రకాష్‌ను పోలీసులు అరెస్టు చేస్తారు. నిర్దోషి అయిన అతడికి వ్యతిరేకతంగా కిషోర్‌(హరీష్‌ ఉత్తమన్‌) అనే పోలీస్‌ ఆఫీసర్‌ దొంగసాక్ష్యాలు సృష్టించి జైలు పాలుచేస్తాడు. అండర్‌ట్రయల్‌ ఖైదీగా సూర్యప్రకాష్‌ ఐదేళ్లు జైలులోనే మగ్గుతాడు. తాను నిర్ధోషిగా నిరూపించుకోవడానికి సూర్యప్రకాష్‌ చేసిన ప్రయత్నాలేమిటి? అతడి పోరాటానికి లాయర్‌ ఆద్య(వరలక్ష్మి శరత్‌కుమార్‌) ఎలాంటి సహకారం అందించింది?సూర్యప్రకాష్‌పై పోలీస్‌ ఆఫీసర్‌ కిషోర్‌ నేరానికి మోపడానికి కారణమేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

విజయ్‌ కనకమేడల కథను తెరపై అద్భుతంగా ఆవిష్కృతం చేయడంలో సాంకేతిక నిపుణుల నుంచి చక్కటి సహకారం లభించింది. సిధ్‌ ఛాయాగ్రహణం, శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం కథానుగుణంగా చక్కగా కుదిరాయి.నిజాయితీగా చిత్రబృందం చేసిన భిన్నమైన ప్రయత్నమిది. వాస్తవికతతో కూడిన సినిమాలు ఎక్కువగా ఇతర భాషల్లోనే రూపొందుతుంటాయని, తెలుగు రావడం లేదనే విమర్శలకు సమాధానంగా నిలుస్తుంది. ఇలాంటి సినిమాల విజయాలు మౌత్‌టాక్‌పైనే ఆధారపడి ఉంటాయి. తెలుగు ప్రేక్షకుల స్పందనపైనే ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంది. కామెడీ సినిమాల హీరోగా తనపై ఉన్న ఇమేజ్‌ను దూరమయ్యేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న నరేష్‌ కెరీర్‌కు ఈసినిమా కొత్త నాంది అవుతుంది.

నటీనటులు: అల్లరి నరేష్-వరలక్ష్మి శరత్ కుమార్-నవమి-వినయ్ వర్మ-హరీష్ ఉత్తమన్-ప్రవీణ్- ప్రియదర్శి-దేవీప్రసాద్-శ్రీకాంత్ అయ్యంగార్ తతదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సిద్
కథ: తూమ్ వెంకట్
మాటలు: అబ్బూరి రవి
నిర్మాత: సతీశ్ వేగేశ్న
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విజయ్ కనకమేడల
రేటింగ్‌:3.25/5