కల్యాణ్ రామ్ హీరోగా తమన్నా కథానాయికగా ‘నా నువ్వే’ సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. ఎమోషన్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, అందుకు సంబంధించిన సన్నివేశాలపై ట్రైలర్ ను కట్ చేశారు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ కావడంతో, ఆ యాంగిల్ లోనే యూత్ కి నచ్చేలా ఈ ట్రైలర్ ను వదిలారు.
కల్యాణ్‌రామ్, తమన్నా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రం ‘నా నువ్వే’. జయేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాధారణంగా ప్రేమ కథల్లో హీరో అమ్మాయి కోసం పరితపిస్తుంటాడు. కానీ ఇందులో తమన్నా..కల్యాణ్ రామ్ ప్రేమ కోసం తపించడాన్ని ట్రైలర్‌లో అందంగా చూపించారు. ప్రేమ, యాక్షన్, కామెడీ ప్రధానంగా సాగే చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు.
‘తపించే క్షణాలకు..నిరాశే చూపించకు..నా నువ్వే’ అంటూ వచ్చే సంగీతం ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో.. కల్యాణ్ రామ్ వేరే ప్రదేశానికి వెళుతుంటే..‘వెళ్లండి..కలుద్దాం’ అని తమన్నా అంటుంది. ఇందుకు పక్కనే ఉన్న వెన్నెల కిశోర్..‘ఇదేం ట్విస్ట్ బావా..జ్యోతిష్యానికే జ్వరం వచ్చేలా ఉంది’ అనడం నవ్వులు పూయిస్తోంది.
ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు పి.సి శ్రీరామ్ కెమెరా పనితనం, షరత్ సంగీతం ఆకర్షణీంగా ఉన్నాయి. కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకంపై కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. మే నెలాఖరున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొంతకాలంగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తోన్న కల్యాణ్ రామ్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి. తమన్నాకి అవకాశాలు తగ్గిన నేపథ్యంలో, ఈ సినిమా సక్సెస్ ఆమెకి కూడా చాలా అవసరమే.