దర్శకుడు తెలంగాణ శంకర్‌.. జన్మదినం

324
- Advertisement -

నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష… వేలాది మంది ఆత్మబలిదానాల ఫలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ఉద్యమంలో ఆట, పాట ఉవ్వెత్తున్న ఎగిసిపడ్డాయి. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న తీరు, ఆ ఉద్యమం పట్ల అవగాహనతో సినిమా రంగంలో ఉన్నప్పటికీ, ఒక ఉన్మాద ఆవరణలో జీవిస్తున్నప్పటికీ శంకర్‌ తను ఏమిటో? ఏ నేల మీద మొలకెత్తిన విత్తనమో తెలుసు. అందుకే అతను ఆత్మబలిదానాలకు కన్నీరు కార్చాడు కావొచ్చు. ఒక శ్రీకాంత్‌చారి మరణం ఆయనను కుంగదీసి ఉండవచ్చు. అందుకే దిక్కులు పిక్కటిల్లేలా ‘జై బోలో తెలంగాణ’ అని నినదించిన దర్శకుడు ఎన్‌. శంకర్ పుట్టినరోజు నేడు.

Jai Bolo Telangana

కమర్షియల్ ఫార్మాట్‌లోనే తనదైన కమిట్‌మెంట్‌తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందించిన దర్శకుడు శంకర్‌. ఆయన ఇంటిపేరు నిమ్మల. గురువయ్య, సక్కుబాయమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం, చింతపల్లి గ్రామంలో జన్మించాడు.

ఎన్ శంకర్‌ను ఎన్‌కౌంటర్ శంకర్‌ అని కూడా పిలుచుకుంటారు. ఎందుకంటే కృష్ణ హీరోగా తెరకెక్కిన ఎన్‌కౌంటర్ సినిమాతో శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు అటు ప్రేక్షకుల నుండి, ఇటు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ విజయంతో ఎన్. శంకర్ పేరు ఎన్ కౌంటర్ శంకర్ గా మారిపోయింది.

1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణా’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.

jai bolo

2011 లో జై బోలో తెలంగాణ చిత్రం సరోజినిదేవి ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా ఎంపికయ్యింది. ఎన్.శంకర్‌ ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నాడు. అవార్డులతో శంకర్ ప్రస్థానం ఆగిపోలేదు. ఆస్కార్‌ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యునిగా.. నంది పురస్కార కమిటీకి రెండుసార్లు సభ్యునిగా, ఒకసారి అధ్యక్షునిగా (2010).. గోవా ఫిలిం ఫెస్టివల్‌ (2009), జాతీయ సినిమా అకాడమీ (2003) పురస్కారాల జ్యూరీకి సభ్యునిగా.. తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటుగా (2013) శంకర్ తన సేవలందించాడు.

n shanker sunil

ప్రస్తుతం ఎన్‌.శంకర్‌ స్వీయ దర్శక నిర్మాణంలో మలయాళంలో విజయవంతమైన టు కంట్రీస్‌ చిత్రాన్ని సునీల్‌ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్‌ బ్యానర్‌పై పొడక్షన్‌ నెం.2గా రూపొందిస్తున్నారు.

శంకర్ సామాజిక చైతన్యం కలిగించే మరిన్నీ సినిమాలు తీయాలని కోరుకుంటూ.. గ్రేట్‌తెలంగాణ.కామ్‌ తరపున ఎన్‌ శంకర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

- Advertisement -