దేశవ్యాప్తంగా పలు పాఠశాలలు, ఆసుపత్రులు, హైకోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలకు తప్పుడు బాంబు బెదిరింపులు పంపిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఇటీవలి కాలంలో పెరుగుతున్న బెదిరింపు సందేశాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీ పోలీస్ అధికారులు కర్ణాటకలోని మైసూరులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని శ్రీనివాస్ లూయిస్ (47)గా గుర్తించారు. ఆయన బెంగళూరుకు చెందినవాడు, ప్రస్తుతం నిరుద్యోగి. తన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన తల్లితో కలిసి నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.శ్రీనివాస్ లూయిస్ గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా 1,100కు పైగా బాంబు బెదిరింపు సందేశాలను పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇమెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా పలు కీలక సంస్థలను పేల్చేస్తామని హెచ్చరించాడు.
ఈ బెదిరింపులు ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టు, అసెంబ్లీ, పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇటీవల ఢిల్లీలో వరుసగా ఇలాంటి బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ పోలీసులు మరియు స్థానిక పోలీసులు కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా శనివారం మైసూరులోని అద్దె ఇంటి నుంచి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక విచారణలో నిందితుడు మానసిక ఒత్తిడిలో ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో ఆయన దేశవ్యాప్తంగా 1,100కు పైగా బెదిరింపులు పంపినట్లు అంగీకరించినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. నిందితుడిని ఢిల్లీకి తీసుకెళ్లి రిమాండ్‌పై విచారణ చేపట్టనున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి బెదిరింపులు పంపాడా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read:కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలివే!
ఇటీవల న్యూ ఢిల్లీలో అసెంబ్లీ, హైకోర్ట్ సహా పలు సంస్థలకు బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా ఆందోళనకు దారి తీసింది.ఈ ఘటన తప్పుడు బెదిరింపులు ఎంతటి భయాందోళనలకు కారణమవుతాయో మరోసారి గుర్తు చేసింది. అధికారులు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

