కొరకరాని కొయ్య… కోమటిరెడ్డి

132
komatireddy
- Advertisement -

ఎంతచేసినా సంతృప్తి చెందని కోమటిరెడ్డి
రేవంత్ సారీ చెప్పినా నో హ్యాపీ
డిమాండ్లు అన్నీ నెరవేర్చినా అసంతృప్తే
మునుగోడు ఫలితంపై కోమటిరెడ్డి ప్రభావం?
తమ్ముడు గెలిస్తే బిజేపీలోకి జంప్?
రాజగోపాల్ ఓడితే కాంగ్రెస్
లోనే వెంకటరెడ్డి
తలలుపట్టుకొన్న కాంగ్రెస్ అధిష్టానం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొరకరాని కొయ్యగా మారాడని టి.పి.సి.సి.నేతలతో పాటుగా అధిష్టానం పెద్దలకు కూడా తలనొప్పిగా మారాడనే విమర్శలున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ మేరకు టి.పి.సి.సి.అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ ఆయన తీరు మారలేదని పార్టీలోని కొందరు సీనియర్ నేతలు మదనపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ ప్రత్యర్థి పార్టీ అయిన బి.జే.పి.తో అంటకాగుతున్నాడని, సొంత తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోలు అసెంబ్లీ నియోవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండటం, తమ్ముడిని గెలిపించాలని పలు గ్రామాల సర్పంచ్లకు ఫోన్లు చేసి అభ్యర్ధించడం వంటివి బయటపొక్కడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. అంతేగాక ముగోడులోని కొందరు సర్పంచ్ లు, ఇతర నాయకులు టి.పి.సి.సి.అగ్రనాయకత్వానికి ఫిర్యాదులు కూడా చేయడంతో ఈ వ్యవహారం ముదిరిపాకాన పడింది.

అందుకే హైదరాబాద్లో ఉంటే పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపుకోసం పనిచేయాల్సి వస్తుందని, అందుకే ఆస్ట్రేలియా వెళితే మొహం చాటాపసినట్లవుతుందనే ఉద్దేశ్యంతోనే వెంకట్ రెడ్డి దేశం వదిలి వెళుతున్నాడని కొందరు సీనియర్ నాయకులు మదనపడుతున్నారు. పి.సి.సి.అధ్యక్ష పదవిని ఆశించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రమైన అసంతృప్తితో పార్టీ క్రమశిక్షణ, నియమావళిని తుంగలో తొక్కి అనేక ఆరోపణలు చేశారని, పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ప్రవర్తించాడని, అయినప్పటికీ టి.పి.సి.సి.నాయకుల దగ్గర్నుంచి కాంగ్రెస్ అధిష్టాన పెద్దల వరకూ అందరూ సంయమనం పాటించారని, ఆయనకు స్టార్ క్యాంపెయినర్ గా పదవిని కట్టబెట్టారని గుర్తు చేశారు. అంతేగాక మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్ధిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించినట్లుగా పాల్వాయి స్రవంతికే టిక్కెట్టు ఇచ్చారని, రేవంత్ రెడ్డి సూచించిన అభ్యర్ధిని కాదని కోమటిరెడ్డి మాటకే కాంగ్రెస్ అధిష్టానం అధిక ప్రాధాన్యత ఇచ్చి గౌరవించిందని, ఇంతజేసినా ఆయన బుద్దిమారలేదని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం పనిచేయాల్సిన స్టార్ క్యాంపెయినర్ ఇలా తన తమ్ముడి గెలుపుకోసం పనిచేస్తూ బండారం బయటపడేసరికి దేశం వదిలి పారిపోతున్నాడని గాంధీభవన్ లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

అంతేగాక ఈనెల 24వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనున్న రాహుల్ గాంధీ పాదయాత్ర సమయానికి ఇక్కడ లేకుండా ఉంటేనే తాను చేసిన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలనీ తెరపైకి రాకుండా మరుగున పడతాయనే ఉద్దేశ్యంతోనే ఆస్ట్రేలియా వెళుతున్నాడని గాంధీభవన్లో వాడీవేడీ చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి బి.జే.పి.లో చేరేందుకు తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఏర్పాట్లు చేశాడని, ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల్లో బి.జె.పి.అభ్యర్ధిగా తన తమ్ము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధిస్తే తప్పకుండా కాషాయం పార్టీలో చేరతాడని, అలా కాకుండా తమ్ముడు గట్టిపోటీ ఇచ్చి ఓటమిపాలై రెండోస్థానంలో నిలిచినా కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బి.జే.పి.తీర్థం పుచ్చుకుంటాడని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఒకవేళ మునుగోడులో బి.జే.పి.ఘోరంగా ఓటమి పాలైతే మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాడని, పార్టీలో ఉంటూ ప్రత్యర్ధి పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తాడని, అది కూడా 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల వరకూ ఇదే విధంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహరిస్తారని కొందరు సీనియర్ నాయకులు అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలను కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తూనే ఉందని,కానీ వెంకట్ రెడ్డిపై వేటు వేసే అవకాశాలు లేవని మాత్రం ఆ నేతలు గట్టిగా చెబుతున్నారు. ఎందుకంటే ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి, టి.పి.సి.సి.లో కీలకమైన స్టార్ క్యాంపెయినర్ పదవిలో ఉండటం వంటి కీలకమైన అంశాలున్నాయని, పైగా పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేసినా తెలంగాణ వంటి పోరాటపటిమ ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ కేడర్ కూడా చూస్తూ ఊరుకోదని వెంటనే అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తారు గనుక ప్రజల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బదనాం అవుతాడని, రాజకీయంగా అతనికే నష్టం వాటిల్లుతుందనే వ్యూహంతోనే అధిష్టానం పెద్దలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయంలో మౌనం వహిస్తున్నారని వివరించారు. అంతేగాక రాజకీయాల్లో హత్యలు ఉండవని, కేవలం ఆత్మహత్యలే ఉంటాయనే సూత్రం తప్పకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సరిపోతుందని అంటున్నారు.

అన్నదమ్ములిద్దరూ పదవులు వచ్చే వరకూ, ఆస్తులు సంపాదించుకునే వరకూ కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా వినియోగించుకొని తీరా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పడు పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు, వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయకుండా జనాన్ని కూడా మోసం చేసిన నాయకులు తప్పకుండా తగిన శిక్షలు అనుభవిస్తారని ఆ నాయకులు శాపనార్థాలు పెడుతున్నారు. కేవలం డబ్బు కోసం, కాంట్రాక్టుల కోసం ప్రజలను, పార్టీని మోసం చేసిన నేతలెవ్వరూ రాజకీయాల్లో ఎక్కువ రోజులు మనుగడ సాగించింది లేదని, అదే కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో కూడా రిపీట్ అవుతుందని ఆ నాయకులు వివరించారు. ఏదిఏమైనప్పటికీ మునుగోడు ఫలితాలపై కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందని అంటున్నారు. ఇలా గాంధీభవన్లో అన్నదమ్ముల వ్యవహారంపై వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవ్వరు గెలుస్తారో…కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి…

- Advertisement -