దేశంలో అత్యంత శ్రీమంతునిగా ముకేశ్ అంబానీకి మళ్లీ అగ్రస్థానం దక్కింది. గతేడాది కాలంలో భారతీయ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ సంపాదన రోజుకు రూ.300 కోట్లు. అయితే ఈ ఏడాదికి గాను బార్క్‌లేస్ హరున్ ఇండియా ధనవంతుల జాబితా తాజాగా మంగళవారం విడుదలైంది. తొలి స్థానంలో ఉన్న ముకేశ్ మొత్తం సంపద.. తర్వాతి మూడు స్థానాల్లో ఉన్నవారి మొత్తం సంపద కంటే ఎక్కువ కావడం గమనార్హం. రూ.3,71,000 కోట్ల సంపదతో వరుసగా ఏడోసారి ముకేశే అగ్రస్థానంలో నిలిచారు. హిందుజా గ్రూప్‌లో ఎస్‌పీ హిందుజా, కుటుంబం రూ.1.59 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక లక్ష్మీ మిత్తల్ రూ.1.14 లక్షల కోట్లతో మూడోస్థానంలో ఉన్నారు.
దేశంలో రూ.1000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపద కలిగిన భారతీయుల సంఖ్య 34 శాతం వృద్ధి చెంది 831కు చేరింది. 2016 ఈ సంఖ్య 339 మంది మాత్రమే కావడం గమనార్హం. వీరి మొత్తం సంపద దాదాపు 719 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.50.39 లక్షల కోట్లు). దేశ జీడీపీలో ఇది పావు భాగానికి సమానం. ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం.. దేశ జీడీపీ 2.85 లక్షల కోట్ల డాలర్లు. దేశ ఆర్థిక రాజధానిలో రూ.1000 కోట్లు కంటే ఎక్కువ సంపద కలిగిన వారు 233 మంది ఉన్నారు. దిల్లీలో ఇటువంటి వారు 163, బెంగళూరులో 70 మంది చొప్పున ఉన్నారు.
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారి సగటు వయసు 60. అత్యల్ప వయసు కలిగిన సంపన్నుడిగా ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేశ్ అగర్వాల్ ఉన్నారు. అత్యధిక వయస్కుడిగా ధరం పాల్ గులాటీ నిలిచారు. ఇక మహిళా సంపన్నులు ఏకంగా 157 శాతం పెరిగి 136కు చేరారు. ఈ జాబితాలో ఫార్మా రంగం నుంచి 13.7 శాతం మంది, ఐటీ నుంచి 7.9 శాతం, ఎఫ్‌ఎమ్‌సీజీ నుంచి 6.4 శాతం మంది చొప్పున ప్రాతినిధ్యం వహించారు. 2017లో జాబితాతో పోలిస్తే.. గ్రాఫైట్ ఇండియా యాజమాని కృష్ణ కుమార్ బంగూర్ సంపద ఏకంగా 430 శాతం వృద్ధి చెందింది.