సెప్టెంబర్ 5 నుంచి జియో ఫైబర్ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు రిలయన్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ. జియో ఆవిష్కరించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రిలయన్స్ వార్షిక సమావేశంలో మాట్లాడిన ముఖేష్ …1600 నగరాల్లోని 2కోట్ల నివాసాలు, 1.5కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్‌ను అందించాలనేది లక్ష్యంగా ముందుకు వస్తున్నామని చెప్పారు.
జియో గిగాఫైబర్‌తో అందివ్వనన్న బ్రాడ్‌బ్యాండ్‌తో కనీసం 100 ఎంబీపీఎస్ మొదలుకొని గరిష్టంగా 1 జీబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తామని ముఖేష్ అంబానీ వెల్లడించారు. దీంతో వినియోగదారులు 4కె అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న వీడియోలను కూడా ఎలాంటి బఫరింగ్ లేకుండా వీక్షించేందుకు వీలు కలుగుతుందన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలోనే తొలిసారిగా జియో 4కె సెట్ టాప్ బాక్స్‌ను తీర్చిదిద్దినట్లు ఆకాష్, ఈషా అంబానీ తెలిపారు. ఒక్క బాక్స్‌లోనే అనేక సదుపాయాలను వినియోగదారులకు అందివ్వడం జరుగుతుందన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎవరికైనా ఉచితంగా వీడియో కాల్స్ చేసుకోవచ్చని ..ఇందుకు గాను జియో కాల్ పేరిట ఓ యాప్‌ను అందిస్తున్నామని తెలిపారు. జియో గిగా ఫైబర్ ద్వారా సోషల్ గేమింగ్ పేరుతో మల్టిపుల్ గేమింగ్ సేవలను అందించనున్నట్లు వెల్లడించారు.