కరోనా వైరస్ విషయంలో ఇస్తున్న మార్గదర్శకాల్లో చాలా గందరగోళం ఉందని తెలిపారు ఎంపీ సురేశ్ రెడ్డి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన మార్గదర్శకాలను కేంద్రం, రాష్ట్రాలు పాటిస్తున్నాయని, అయితే డబ్ల్యూహెచ్‌వోతో కేంద్రానికి ఉన్న అనుబంధం ఎటువంటిదని, ప్రపంచ ఆరోగ్య సంస్థకు కేంద్రం ఎటువంటి రేటింగ్ ఇస్తున్నదో వెల్లడించాలని ఎంపీ సురేశ్ రెడ్డి కోరారు.
రాజ్యసభలో మాట్లాడిన సురేశ్ రెడ్డి … కరోనా వ్యాక్సిన్ కోసం అందరం ఎదురుచూస్తున్నామని చెప్పారు. తాను యువకుడిగా ఉన్న సమయంలో దేశం మొత్తం జయాబచ్చన్ సినిమా రిలీజ్ కోసం వేచి ఉండేదని, ఈ రోజుల్లో యావత్ దేశం మొత్తం వ్యాక్సిన్ రిలీజ్ కోసం ఎదురుచూస్తోందన్నారు.
వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న భారతీయ కంపెనీలకు ఎటువంటి సహాయం చేస్తున్నారన్న విషయాన్ని కేంద్రం తెలపాలని… వ్యాక్సిన్ తయారీ కోసం కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్సులు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. కోవిడ్ యోధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఎటువంటి సహాయం చేస్తున్నదో చెప్పలేదన్నారు.