అరుదైన అపురూప శిల్ప కళా నైపుణ్యం గల ఓ శిల్పి పేరుతో పేరుగాంచిన రామప్ప దేవాలయంలో త్వరలోనే శిల్ప కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. త్వరలోనే డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసి, సిఎంకు సమర్పిస్తామన్నారు. కెసిఆర్ అనుమతితో రామప్పలో శిల్ప కళాశాలను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతోనే తాను ఎంపీ సంతోశ్, మరో ఎమ్మెల్సీ నవీన్‌తో కలిసి తిరుమలలో, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిలా శిల్ప ఉత్పత్తి విభాగాన్ని పరిశీలించినట్లు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రామప్పని అంతర్జాతీయ స్థాయి టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఆ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. దేవాలయ తూర్పు ద్వార పునరుద్ధరణ, రోడ్డు నిర్మాణ పనులు చివది దశలో ఉన్నాయన్నారు. కాకతీయుల కాలం నాటి రామప్ప గుడి, ఆ గుడిపై అపురూప శిల్పాలు చెక్కిన రామప్ప అనే శిల్ప పేరుతోనే ఆ దేవాలయం అలరారుతుండటం ఇక్కడి విశేషం అన్నారు. ఇక్కడ శిలా, శిల్ప కళాశాల పెడితే, అటు పురాతన కళను, ఇటు పూర్వ వైభవాన్ని ఇనుమడింప చేసే అవకాశం కలుగుతుందని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
అత్యంత సహజమైన రామప్ప చెరువులో ఉన్న ఐల్యాండ్‌లో శిలా శిల్ప కాళాశాల ఆహ్లాద కర వాతావరణంలో అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌ల దృష్టిలోనూ ఉన్నాయన్నారు.సీఎం అనుమతి, అందరి సహకారంతో రామప్పలో శిల్ప కళాశాల పెట్టాలని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం తిరుమలలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శిలా శిల్ప ఉత్పత్తి విభాగాన్ని పరిశీలించామని, నిర్వహణ తీరుని, వ్యయాలను పరిశీలించామన్నారు. అక్కడి నిర్వహకులతో మాట్లాడామన్నారు. పూర్తి ప్రాజెక్టు రిపోర్టుని తయారు చేసి, సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తామన్నారు. వారి అనుమతి రాగానే, కళాశాల ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వివరించారు.