పీఎస్ఎల్వీ సి- 50 ప్రయోగం విజయవంతం..

245
PSLV-C50 rocket
- Advertisement -

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గురువారం మరో రాకెట్ ప్రయోగం నిర్వహించింది. శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సి-50 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగసింది. విపత్తుల నిర్వహణ, ఇంటర్నెట్ సేవల కోసం ఉద్దేశించిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ తనతో పాటు మోసుకెళ్లింది. ప్రస్తుతం ఈ సీఎంఎస్-01 శాటిలైట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. కాగా, కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఇస్రో చేపట్టిన రెండో ప్రయోగం ఇది.

ఈ రాకెట్‌ 44.4 మీ ఎత్తు ఉండగా, 2.8 మీటర్ల వ్యాసం ఉన్నది. 320 టన్నుల బరువున్న ఈ వాహక నౌక నాలుగు దశల్లో అంతరిక్షంలోకి చేరుతుంది. అదేవిధంగా భూబదిలీ కక్ష్యలోకి 1,425 కిలోలు, సూర్యానువర్తన కక్ష్యలోకి 1750 కిలోల బరువును మోసుకెళ్లగలుగుతుంది. కౌంట్ డౌన్ లో ఎలాంటి అవాంతరాలు ఎదురవకపోవడంతో నిర్దేశిత సమయానికే ఈ రాకెట్ రోదసిలోకి దూసుకుపోయింది.

ఈ రాకెట్‌ ప్రయోగానికి బుధవారం మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభ‌మైంది. 20.11 నిమిషాల్లో కక్ష్యలోకి ఉపగ్రహాన్ని విడిచిపెట్టేలా ఏర్పాట్లు చేశారు. 1,410 కిలోల బరువు కలిగిన 42వ దేశీయ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం సీఎంఎస్‌-01ను ఈ రాకెట్‌ జియో స్టేషనరీ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జీటీవో)లోకి చేరవేయనుంది. 2011లో ప్రయోగించిన జీశాట్‌-12 కాలపరిమితి ముగిసిపోవడంతో దానిస్థానంలో జీశాట్‌-12ఆర్‌ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలని ఇస్రో నిర్ణయించింది. అయితే ప్రస్తుతం దాని పేరును సీఎంఎస్‌-01గా మార్చి కక్ష్యలోకి చేరవేస్తున్నారు.

- Advertisement -