పచ్చదనం పెంపు..ప్లాస్టిక్ నియంత్రణకు పాటుపడతాం

48
- Advertisement -

సహజమైన అటవీ ప్రాంతంలో కొండలు, గుట్టల మధ్య వెలసిన కొండగట్టును దేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంగా పునర్ నిర్మించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున దత్తత తీసుకుని అభివృద్ది చేస్తామని సీఎం పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ గతంలో ప్రకటించారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదేళ్లు పూర్తి చేసుకుని, ఆరో యేట అడుగు పెడుతున్న సందర్భంగా కొండగట్టు ఆలయాన్ని దర్శించుకుని, అటవీ అభివృద్ది పనులకు ఎంపీ శ్రీకారం చుట్టారు. తొలి దశలో కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో పనులను ప్రారంభించారు. జే.ఎన్.టీ.యు విద్యార్థులతో కలిసి వెయ్యి మొక్కలు నాటారు.

కొండగట్టును సందర్శించే భక్తులు సేదతీరేందుకు వీలుగా అహ్లాదకరమైన వాతావరణంలో ఫారెస్ట్ పార్క్ ను తీర్చిదిద్దుతామని, మిగతా అటవీ ప్రాంతమంతా పునరుద్దరణకు వీలుగా అటవీ శాఖ చేపట్టే చర్యలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఎం.పీ నిధుల నుంచి ఒక కోటీ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలను (104. 85 లక్షలు) కేటాయించారు. అటవీ ప్రాంతానికి రక్షణ కంచె, వాకింగ్ ట్రాక్, వాచ్ టవర్, గజేబోల నిర్మాణం చేపట్టనున్నారు.

Also Read:రైతులను చావగొట్టిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే..

ముఖ్యమంత్రి మానస పుత్రిక తెలంగాణకు హరితహార స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించామని, గత ఐదేళ్లలో పర్యావరణ రక్షణకు, ప్రకృతి పునరుద్దరణకు పాటు పడటం అత్యంత సంతృప్తిని కలిగించిందని ఎం.పీ సంతోష్ కుమార్ అన్నారు. విచ్చల విడిగా పెరిగిన ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, కాలుష్యంపై అవగాహన పెంచటం, పలు కార్యక్రమాలను చేపట్టడం ఆరో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రాధాన్యతగా పెట్టుకున్నామని ఎం.పీ ప్రకటించారు.

అన్ని రంగాల్లో అభివృద్దితో పాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కాంక్షిస్తున్నారని, కాళేశ్వరం కట్టినా, యాదాద్రి పునర్ నిర్మాణం చేసినా, ఇప్పుడు కోటి మొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ది నిర్ణయమైనా కేసీయార్ దార్శనికతకు నిదర్శనమని సంతోష్ కుమార్ అన్నారు.

Also Read:చిక్కుల్లో మెగాహీరో సాయిధరమ్!

 

- Advertisement -