మాట నిలుపుకున్న ఎంపీ సంతోష్ కుమార్…

228
gic
- Advertisement -

గత యేడాది మంత్రి కేటీయార్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కింద కీసర అడవిని ఎంపీ సంతోష్ కుమార్ దత్తత తీసుకున్నారు. ఆమేరకు ఆగస్ట్ 31, 2019న కీసరలో అటవీ పునరుజ్జీవన చర్యలు, ఎకో టూరిజం పార్కు అభివృద్దికి మొక్కలు నాటి శంకుస్థాపన చేశారు. ఆ రోజు జరిగిన సభలో మాట్లాడిన సంతోష్ తన స్నేహితులు, సన్నిహితులను కూడా ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తానని మాట ఇచ్చారు. ఆ మేరకు ఏడాదిలోనే దీనిని కార్యరూపంలోకి తెచ్చారు. ఈ యేడాది జూన్ 11న నాలుగో విడత గ్రీన్ ఛాలెంజ్ ను ప్రారంభించి మొక్క నాటిన హీరో ప్రభాస్, సంతోష్ సూచన మేరకు రిజర్వు ఫారెస్ట్ ను దత్తత తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వంతోనూ, అటవీ శాఖతోనూ సంప్రదింపులు జరిపిన మీదట ఖాజీపల్లి అటవీ ప్రాంతం ఖరారు అయింది. త్వరలోనే మరిన్ని అటవీ బ్లాకులను ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు దత్తత ఇచ్చే అవకాశం ఉందని, వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు. కోవిద్ నిబంధనల కారణంగా అతి కొద్ది ఆహ్వానితుల సమక్షంలో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించే ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు అడవుల సంరక్షణకు అధిక ప్రాధ‌న్య‌నిస్తున్నారన్నారు. న‌గర, పట్టణ వాసులకు శారీరక ధారుడ్యం మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) దోహదం చేస్తాయని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు తీసుకుంటున్న ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ లాంటి ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. కీసరగుట్ట రిజర్వ్‌ ఫారెస్ట్‌ అటవీ ప్రాంతాన్ని సంతోష్ కుమార్ దత్తత తీసుకుని అర్బ‌న్ ఫారెస్ట్, ఎకో టూరిజం పార్క్ గా అభివృద్ది చేస్తున్నారని…. దీన్ని స్పూర్తిగా తీసుకుని సినీ న‌టుడు ప్ర‌భాస్ కాజీప‌ల్లి రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్దికి ముందుకు రావ‌డం అభినంద‌నీయమని తెలిపారు.

దీన్ని స్పూర్తిగా తీసుకుని వివిధ రంగాల‌కు చెందిన వ్య‌క్తులు ముందుకు రావాల‌ని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర రెడ్డి, జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర రావు, అటవీ, రెవెన్యూ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -