బండి బ్యాచ్‌కు దబిడిదిబిడే..!

45
bandi

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఇన్నాళ్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆగర్భ శత్రువు బీజేపీని మాత్రం విమర్శించడం లేదు. ముఖ్యంగా మోదీ, అమిత్‌షా వంటి కాషాయ పెద్దలపై పెద్దగా నోరెత్తడం లేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పెద్దలపై ఇష్టానుసారంగా వ్యక్తిగత దూషణలు చేసే రేవంత్ రెడ్డి బీజేపీ వరకు వచ్చేసరికి ముక్తసరి విమర్శలకే పరిమితం అవుతున్నారు. దీనికి కారణం తనపై ఉన్న ఓటుకు నోటు కేసు మాత్రమే. ఎక్కువ మాట్లాడితే కాషాయ పెద్దలు తనను టార్గెట్ చేసి ఓటుకు నోటు కేసులో జైలుకు పంపిస్తారనే భయంతో రేవంత్ కేంద్రంపై నోరెత్తడానికి రేవంత్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొన్నాళ్లుగా రేవంత్ స్పీడ్‌ ముందు స్లో అయిన భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిస్తే మళ్లీ ఫాంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

హుజురాబాద్‌లో తనకు అత్యంత సన్నిహితుడైన ఈటలను గెలిపించాలని రేవంత్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. అందుకే కొండా సురేఖ వంటి బలమైన అభ్యర్థి ఉంటే ఓట్లు చీలి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడని ఊహించిన రేవంత్ రెడ్డి బలమూరి వెంకట్ వంటి అనామక అభ్యర్థిని బరిలోకి దింపాడు. కాని మరోవైపు ఈటల గెలిస్తే బీజేపీకి పట్టపగ్గాలు ఉండవని, మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని తొక్కేసేందుకు ప్రయత్నిస్తుందని రేవంత్‌ భయపడుతున్నాడు. అందుకే ఇక లాభం లేదని, టీఆర్ఎస్‌తో పాటు బీజేపీని కూడా టార్గెట్ చేయాలని రేవంత్ ఫిక్స్ అయ్యాడంట..తన బాస్ చంద్రబాబు ఉన్నంత వరకు వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చని, తనను ఓటుకు నోటు కేసులో జైలుకు పంపించడం బీజేపీ పెద్దల వల్ల కూడా కాదని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడంట..వచ్చేసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అవుతానని కలలు కంటున్న రేవంత్ రెడ్డి పక్కలో బల్లెంలా ఉన్న బీజేపీని కూడా తక్కువ అంచనా వేయవద్దని భావిస్తున్నాడంట.

అందుకే తన సోషల్ మీడియా టీమ్‌తో మోదీని టార్గెట్ చేస్తూ వ్యంగ పోస్టులు పెట్టిస్తున్నాడని గాంధీభవన్‌లో ప్రచారం జరుగుతోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్‌లో …ఆయన గారు ఛాయ్ అమ్మటం ఎవ్వరూ చూడలేదు..కాని అందరూ నమ్ముతారు . అదే ఆయన గారు ఇప్పుడు అందరి కళ్లముందే దేశాన్ని అమ్ముతున్నాడు, కాని ప్రజలు ఎందుకు నమ్మడం లేదు..? అంటూ మోదీని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ట్వీట్ చేసిన కాంగ్రెస్ అభిమానులు బీజేపీని చెడుగుడు ఆడుకుంటున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి రూట్ మార్చాడని మున్ముందు బండి బ్యాచ్‌కు కూడా దబిడిదిబిడే అని ఆయన ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. మరి మోదీని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో చేయిస్తున్న ప్రచారంపై తెలంగాణ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.