బీజేపీలో లంగా దందాలు..లోపాయికారీ వ్యవహరాలు..!

176
perala
- Advertisement -

తెలంగాణ బీజేపీలో లంగా దందాలు..లోపాయికారీ వ్యవహరాలు జరుగుతున్నాయటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ బీజేపీ జాతీయ మాజీ కార్యదర్శి పేరాల శేఖర్ రావు రాసిన బహిరంగ లేఖ కాషాయ పార్టీలో కలకలం రేపుతోంది.. లింగోజీ గూడ కార్పొరేటర్ ఏకగ్రీవ ఎన్నిక విషయంలో బీజేపీ నేతలు ప్రగతిభవన్‌కు వెళ్లి మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఘటనలో తనను బలిపశువును చేశారంటూ బండి సంజయ్, కిషన్ రెడ్డి, సంఘ్‌పరివార్‌కు బీజేపీ జాతీయ మాజీ కార్యదర్శి పేరాల శేఖర్ రావు బహిరంగ లేఖ రాసారు. దీంతో కాషాయ పార్టీలో మరోసారి ప్రగతిభవన్ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. అసలేం జరిగిందంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజీ గూడ నుంచి బీజేపీ కార్పొరేటర్‌గా గెలిచిన రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయకముందే కరోనాతో మరణించారు.

దీంతో మళ్లీ ఆ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి. లింగోజీగూడ డివిజన్ స్థానంలో రమేష్ గౌడ్ కుమారుడికి టికెట్ ఇచ్చిన బీజేపీ నేతలు ఆస్థానాన్ని ఏకగ్రీవం చేసేందుకుగాను ప్రగతిభవన్‌కు వెళ్లారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకే అప్పటి బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు, రమేష్ గౌడ్ కుటుంబసభ్యులు ప్రగతి భవన్‌కు వెళ్లి మంత్రి కేటీఆర్‌ను కలిసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలు ప్రగతి భవన్‌కు వెళ్లి కేటీఆర్‌ను కలవడంపై బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది.ఈ విషయమై నిజనిర్ధారణ క‌మిటీ వేసి, చర్యలు తీసుకోవాలని బండిని అమిత్‌షా ఆదేశించారు. అయితే తాజాగా ఈ ఇష్యూలో తనను బలిపశువును చేశారంటూ బీజేపీ జాతీయ మాజీ కార్యదర్శి పేరాల శేఖర్ రావు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, బండి సంజయ్‌కు, సంఘ్‌ పరివార్‌కు బహిరంగ లేఖ రాసారు. లింగోజిగూడ డిమిజన్ ఏకగ్రీవం కోసం ప్రగతి భవన్ వెళ్లిన సందర్భంగా ఏం జరిగిందో వివరిస్తూ పేరాల శేఖర్ లేఖ రాశారు. సంఘ్ పెద్దలు మంత్రి శ్రీనివాసులు ప్రోద్బలంతో బండి సంజయ్ కిషన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారని పేరాల ఆరోపించారు.

లింగోజీ గూడ ఇష్యూలో కిషన్ రెడ్డిని కాపాడుకున్న సంఘ్ పెద్దలకు, మంత్రి శ్రీనివాసులుకు, బండి సంజయ్‌కి తాను ఎందుకు గుర్తురాలేదని పేరాల శకర్ ప్రశ్నించారు. పార్టీలో టీం స్పిరిట్ కొరవడిందని.. వ్యక్తిగతంగా కానీ .. సమావేశాల్లో కానీ స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నామని శేఖర్ ధ్వజమెత్తారు. పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టి కొందరు బీజేపీ నేతలు వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ స్వార్థ వ్యవహారాలకు పాల్పడుతున్నారని, పార్టీలో అంతర్గత అవినీతి తారాస్థాయికి చేరుకుందని పేరాల తన లేఖలో తీవ్ర విమర్శలు గుప్పించారు. కనీసం తనతో ఫోన్లో గాని వ్యక్తిగతంగా కాని ఎందుకు మాట్లాడలేదని పార్టీ పెద్దలను పేరాల నిలదీశారు. పార్టీలో కొంతమంది చేస్తోన్న లంగా దందాలు.. లోపాయికారీ వ్యహారాలు తాను చేయలేదని పేరాల సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా లింగోజీ గూడ డివిజన్ ఏకగ్రీవం కోసం ప్రగతిభవన్‌కు బీజేపీ నేతలు వెళ్లిన వ్యవహారంలో తనను బలిపశువును చేశారంటూ ఆ పార్టీ జాతీయ మాజీ కార్యదర్శి పేరాల శేఖర్ రావు రాసిన బహిరంగ లేఖ కాషాయ పార్టీలో సంచలనంగా మారింది. పార్టీలో లంగా దందాలు, లోపాయికారీ వ్యవహారాలు చేస్తుంది బండి సంజయే అన్నట్లుగా పేరాల వ్యాఖ్యలు ఉన్నాయని కమలం పార్టీలో చర్చ జరుగుతోంది. మరి పేరాల లే‌ఖపై బీజేపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -