వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎంపీ రఘురామకృష్ణరాజును నిన్న హైదరాబాదులో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో రఘురాజు బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురాజు తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు కోర్టులో వాదనలు వినిపించారు.
ప్రాథమిక విచారణ కూడా జరపకుండానే లోక్ సభ సభ్యుడు రఘురాజును అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. రఘురాజు అరెస్టుకు సంబంధించి సహేతుక కారణాలు కూడా లేవని వాదించారు. ఎటువంటి కారణాలు చూపకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. వాదనలు విన్న తర్వాత బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ అంశంపై జిల్లా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. దీంతో, కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం హైకోర్టు తన తీర్పును వెలువరించింది. సీఐడీ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేయాలని సూచించింది. బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.