సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి బాలాజీ గార్డెన్‌లో మిరుదొడ్డికి చెందిన సుమారు 100 మంది బీజేపీ కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్,టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, మండల టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్,బీజేపీ నేతలు కళ్లబొల్లి మాటలతో గారడి చేయడం తప్ప ఏమీ చేయరు. కొడంగల్‌లో హరీష్ రావు దెబ్బకు చిత్తు చిత్తుగా ఓడి పోయిన రేవంత్ రెడ్డి చెబితే దుబ్బాక ప్రజలు వింటరా.. కూట్లే రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తరా..?? అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్ళు అన్ని మేమే చేస్తున్నామని అబద్ధాల ప్రచారాలు చేయడం తప్ప…ఒక్క పని చేయలేడు. బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలపై హరీష్ రావు సవాల్ విసిరారు… నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు.. ఒక్క బీజేపీ నాయకుడు కూడా దీనికి స్పందించలేదు..తోక ముడుచుకొని వెళ్ళి పోయారని ఎంపీ ఎద్దేవ చేశారు.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ ఖాలీ అయ్యింది.. రోజురోజుకూ ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు టీఆర్‌ఎస్ పార్టీ లో చేరుతున్నారు. బీజేపీ నేతలు చెబుతున్న అవాస్తవాలను ఆపార్టీ నేతలే నమ్మే పరిస్థితిలో లేదన్నారు. నేను విసిరిన సవాల్ కు ఒక్క బీజేపీ నేత కూడా స్పందించలేదు..తెలుకుట్టిన దొంగల్లా దాక్కున్నారని మంత్రి విమర్శించారు. బీహార్‌లో ఎన్నికల్లోనూ అబద్దాలే… అక్కడ ఎన్నికల్లో గెలిస్తే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు.. బీజేపీ నేతలు దుబ్బాకలో ఉచితంగా ఇవ్వరా..?..తెలంగాణలో ఇవ్వారా..? దేశంలో ప్రజలు లేరా..? పేద ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వారా…? ఏ ముఖం పెట్టుకొని దుబ్బాకలో బీజేపీ నేతలు ఓట్లు అడుగుతారని మండిపడ్డారు.
ఇలాంటి ధోఖేబాజ్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటు వెయ్యాలి..? దుబ్బాక ప్రజలు మీరు చెబుతున్న అబద్దాల మాటలకు కర్రు కాల్చి వాత పెడుతరు..తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో బీజేపీ వాటా ఎంతో చెప్పాలని అడిగితే ఒక్కడు మాట్లాడడం లేదు…కాయితం తెచ్చి చూపించలేదు.. కాంగ్రెస్ అంటే…కాలి పోయే ట్రాంఫార్మర్లు. బీజేపీ అంటే కరెంటు మోటర్లకు మీటర్లు ఎద్దేవ చేశారు. బీడీల కట్టలకు పుర్రె గుర్తు పెట్టి బీడీ కార్మికుల నోట్లో మట్టి కొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దుబ్బాకలో 20 వేల మంది బీడీ కార్మిక మహిళలకు 2016 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రైతుల మెడలు ఉరితాళ్ళు బిగిస్తామంటున్న పార్టీ బీజేపీ పార్టీ అన్నారు. రైతులకు,కరెంటు ఇవ్వక,నీళ్లు ఇవ్వక.విత్తనాలు ఇవ్వక అష్టకష్టాలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి తెలిపారు.
అధికారంలో ఉన్నన్ని రోజులు దుబ్బాక మొఖం చూడని…ఇక్కడి అభివృద్ధి గురించి పట్టించుకోని కాంగ్రేస్ పార్టీలోని పెద్ద పెద్ద నాయకులంతా ఇవ్వాళ్ళ దుబ్బాకకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు..ఈ నేతలంతా ఎముఖం పెట్టుకొని తిరుగుతున్నారు. ఎన్నికలయ్యాక ఒక్క నాయకుడు కూడా దుబ్బాకలో కనిపించడు..ప్రజల కష్ఠ సుఖాల్లో ఎల్లప్పుడూ ఉండేది మేమె. దుబ్బాకను అన్ని రంగాల్లోని అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నేను తీసుకుంటా.. దుబ్బాక ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల డిపాజిట్లు గల్లంతు చేయాలని మంత్రి హరీష్ పేర్కొన్నారు.