అన్ని దానాలకు మించింది ఏంటి..? అన్నదానం..విద్యాదానం ఇలా అవసరాన్ని బట్టి చెప్పుకుంటాం..కానీ ప్రాణదానాన్ని మించింది ఏదైనా ఉంటుందా…? ఏదీ ఉండదు..అలా ప్రాణదానం చేసే అవకాశం ఒక్క అవయవదానంతోనే సాధ్యం.. అవును మనం మరణించినా మన అవయవాలు మరొకరికి జీవితాన్నిస్తాయి.. మనం మరణించినా వారి ద్వారా మళ్లీ జీవించే అవకాశాన్నిస్తాయి.. ఇంత అద్భుతమైన అవయవ దానం పట్ల ఏదీ అవగాహన.. ? ఎన్నో అపోహలు..ఎన్నో అనుమానాలు..మతాచారాలు..మూఢ నమ్మకాల కారణంగా మనం అవయవదానం అంటే వెనుకడుగు వేస్తున్నాం.. అందుకే సీఏం కేసీఆర్ జన్మదినోత్సవ శుభ వేళ ఆయన తనయ, ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో అవయవ దాన సంకల్ప కార్యక్రమం నిర్వహించబోతున్నారు… మీకు తెలుసా… రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్షా 30 వేల మంది చనిపోతున్నారు.. వీరిలో కేవలం 150 మాత్రమే అవయవదానం చేస్తున్నారు..ఇక కిడ్నీ వ్యాధులతో ఏటా 3లక్షల మంది చనిపోతున్నారు..అవయవదానంతో ఈ మరణాల్ని పూర్తిగా ఆపవచ్చు.. ఒక మనిషి అవయవదానంలో మరో ఏడుగురికి జీవం పోయొచ్చు అంటే ఇంతకంటే అద్భుతం ఏముంటుంది..మానవుడే దేవుడుగా మారే అవకాశం ఇంతకంటే ఏముంటుంది.
సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిని బ్రెయిన్ డెడ్ గా పరిగణిస్తారు. వారినుంచే అవయవాల్ని సేకరిస్తారు..ఇలా చనిపోయిన ఒక వ్యక్తి నుంచి 200 అవయవాల్ని, టిష్యూల్ని దానం చేయొచ్చు..కళ్లు, గుండె, కాలేయం, మూత్ర పిండాలు..ఊపిరి తిత్తులు, క్లోమం, పెద్ద పేగు, చిన్న పేగులు..ఎముకలు, మూలుగను దానం చేయొచ్చు. అలా కనీసం ఏడుగురికి ప్రాణదానం చేయొచ్చు..
చనిపోయాక అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి. గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె కవాటాలు వంటి వాటిని 6 నుంచి 24 గంటల్లోపు సేకరించవచ్చు.అవయవ దానం మనిషికి రెండో జీవితం.. అలాంటి ఈ గొప్ప కార్యక్రమం మహోద్యంగా సాగాలి.. విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది.. అవగాహన కల్పించాల్సి ఉంది..ప్రతీ ఏటా రెండున్నర లక్షల మందికి కిడ్నీలు అవసరం.. ఐదు వేలమందికి గుండె మార్పిడి అవసరం ఉంది.. అందుబాటులో కనీసం ఐదు గుండెలు కూడా లేవు.. కంటి చూపు తెప్పించే కార్నియాలు నాలుగున్నర వేలు అందుబాటులో ఉంటే లక్ష మంది కంటి చూపు కోసం ఎదురుచూస్తున్నారు..
అవయవదానం చేయడానికి స్పెయిన్ లో లక్షకు 35 మంది, అమెరికాలో 26 మంది..ఆస్ట్రేలియాలో 11 మంది చొప్పున అంగీకారం తెలిపారు..కానీ మన దేశంలో.. లక్షకు కాదు కదా…10 లక్షల మందిలో కూడా ఒకరు లేరు..మనిషి చనిపోయాక తనతోపాటే శరీరంలోని అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. లేదా చితిలో కాలి బూడిదవుతాయి. అదే అవయవ దానం చేయడం వల్ల మరణం తర్వాతా జీవించవచ్చు.
అవయవాలన్నీ వేరొకరి శరీరంలో ఉండటం వల్ల చనిపోయినా జీవించినట్లే లెక్క. విశ్వాసాలు, మూఢ నమ్మకాలు ఎలా ఉన్నా.. అవయవ దానంపై రోజురోజుకూ పెరుగుతున్న అవగాహనతో కొత్త అధ్యాయాలు ఆవిష్కతమవుతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 30 ఆసుపత్రులకే ఒక రోగిని బ్రెయిన్ డెడ్ అని నిర్ణయించే అర్హత, అవయవ మార్పిడి చేసే అర్హత ఉన్నాయి.. ఈ సంఖ్య పెరిగితేనే ఎంతోమందికి అవయవదానం చేసే అవకాశం పెరుగుతుంది..ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్లవుతుంది.. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం అవయవదాత కుటుంబానికి ఐదు లక్షల నజరానా ప్రకటించింది.. అలాగే స్వీకర్తలకూ ఉచిత మందులు ఇస్తుంది.. అలాగే ఈ సర్జరీ నిర్వహించిన ఆసుపత్రికి కూడా ప్రభుత్వం 50 వేలు బహుమానంగా ఇస్తుంది.. దీని కోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే జీవన దాన్ పథకంలో మీ పేరు నమోదు చేసుకోవాలి..
అవయవ దానం చేయండి..జీవితాన్ని సార్థకం చేసుకోండి..
మీ కళ్లు మరొకరికి లోకాన్ని చూపిస్తాయి..
మీ గుండె వేరొకరి జీవితాన్ని నిలబెడుతుంది.
మీ ఊపిరితిత్తులు ఇంకొకరికి ఊపిరి పోస్తాయి.
మీ కణజాలం వేరొకరికి ప్రాణప్రదం అవుతుంది..
అవయవదానం చేయండి..
మరణించినా జీవించండి..
ఫిబ్రవరి 17వ తేదీన హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఉదయం 9గంటలకు అవయవ దాన సంకల్ప కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది. అందరం పాల్గొని మన సంకల్పాన్ని ప్రకటిద్దాం…