రాష్ట్రంలో వ్యాక్సిన్ అందించడానికి ప్రణాళిక సిద్ధం: కేకే

170
kk
- Advertisement -

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు, వ్యాధి సోకిన వారి వైద్య చికిత్సకు కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు అన్నారు. కరోనా ఓ జాతీయ విపత్తు అని, దీన్ని దేశమంతా కలిసి ఎదుర్కోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాలను, అన్ని రాజకీయ పక్షాలను సంప్రదించి ముందుకుపోవాలనే ప్రధాని మోడీ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీ నాయకులతో మాట్లాడారు. టిఆర్ఎస్ రాజ్యసభ నాయకుడు కె.కేశవరావు, లోకసభ నాయకుడు నామా నాగేశ్వర్ రావు హైదరాబాద్ నుంచి పాల్గొన్నారు.

‘‘కరోనా వైరస్ కు విరుగుడుగా వ్యాక్సిన్ వస్తున్నది. దీన్ని ప్రాధాన్యతా క్రమంలో అందరికీ వేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం మన ముందున్న సవాల్. ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా, ఓ ప్రణాళిక ప్రకారం చేయాలి. దీనికోసం ప్రభుత్వం యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. కేవలం వ్యాక్సిన్ తోనే సమస్య సమసిపోదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. రాబోయే రెండు నెలలు జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. సెకండ్ వేవ్ ప్రమాదం కూడా పొంచి ఉంది.కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు కొనసాగాల్సి ఉంది’’ అని కేశవరావు వివరించారు.

‘‘తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్ అందించడం కోసం అవసరమైన ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధం చేశారు. ముందుగా వైద్యసిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ చైన్ సిద్ధం చేశారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి కూడా తెలంగాణ రాష్ట్రంలోకట్టుదిట్టమైన చర్యలు అమలు అవుతున్నాయి. పరీక్షల సంఖ్య బాగా పెరిగింది. పరీక్షలు చేసిన వారిలో సగటున 1.1 శాతం మంది మాత్రమే పాజిటివ్‌గా తేలుతున్నారు. రికవరీ దాదాపు 96 శాతం ఉంది. చనిపోతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది’’ అని కెకె వివరించారు.

- Advertisement -