తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు ఎంపీ బడుగుల లింగయ్యా యాదవ్. రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్, డ్రైపోర్టుల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఎంపీ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడంలేదన్నారు.
రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన బడుగుల లింగయ్య… సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో పురోగమిస్తున్నదని, దేశానికే ఆందర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. కొత్తరాష్ట్రమే అయినప్పటికీ అభివృద్ధిలో ముందంజలో ఉన్నదని చెప్పారు. టీఎస్ ఐపాస్‌ను ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి 14,857 పరిశ్రలు వచ్చాయని, రూ.27వేల కోట్లతో వెబ్‌సర్వీసెస్ కూడా వచ్చాయన్నారు.
విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి డ్రైపోర్టు రావాల్సిఉన్నప్పటికీ కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపించారు. నల్లగొండ జిల్లా దండు మల్కాపూర్ వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పారిశ్రామిక కేంద్రం ఉన్నదని తెలిపారు.ఇండస్ట్రియల్ కారిడార్ కోసం జహీరాబాద్ వద్ద 3500 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంచేసిందని చెప్పారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో 10,500 ఎకరాలను సేకరించిందన్నారు.