ఈటల రాజేందర్‌పై మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు మండిపడ్డారు. దళితబంధు డబ్బులు వాపస్ పోతాయని ఈటల రాజేందర్ దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా..ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు వేసింది. దళిత బంధు పథకంలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన సి ఎం కేసీఆర్ కు అండగా నిలబడదాం అని ఆయన అన్నారు. బ్యాంకుల్లో పది రూపాయల లోన్ అడిగితే.. వంద రూపాయల ష్యురిటీ అడుగుతున్నారు.. కానీ నేడు కేసీఆర్ ఎలాంటి షూరిటీ లేకుండా, తిరిగి కట్టాల్సిన అవసరం లేకుండా పది లక్షల రూపాయలు దళితులకు నేరుగా ఇస్తున్నారని మోత్కుపల్లి అన్నారు. కేసీఆర్ ను మించిన శక్తి మంతులు ఎవరు లేరు..ఇంటింటికి గోదావరి జలాలు అందిస్తున్న వ్యక్తి కేసీఆర్, పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మోత్కుపల్లి చెప్పారు.
ఈటలకు వేల కోట్లు ఏవిధంగా వచ్చాయి? వందల ఎకరాలు ఎలా వచ్చాయి..? నీవు పేదవాడివైతే నీ కోసం బాధపడేవాళ్ళం.. కానీ నీవు దోపిడీ చేస్తూ బతుకుతున్నావ్ అని మోత్కుపల్లి ఆగ్రహాం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పెద్ద మెడికల్ కాలేజీ పెట్టుకున్నావు, ఎవరికీ లేనన్ని ఆస్తులు సంపాదించుకుని కోటీశ్వరునివి అయిపోయావ్.. ఈరోజు హుజురాబాద్‌లో చూస్తే.. పేదవానిలా ఒకవైపు మాట్లాడుతూనే ఈటల రాజేందర్ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాడు.. ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఈ డబ్బులు అని అడుగుతున్నా అంటూ ఈటలను మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులకు సిగ్గు లేదు.. నామినేషన్ వేసే ముందు అభ్యర్థిని ప్రకటించారు. మా ఓట్లన్నీ బీజేపీకే అన్న విధంగా కాంగ్రెస్ నాయకులూ వ్యవహరిస్తున్నారు.. మీరు ఎంత మంది ఏకమైనా టీఆర్‌ఎస్ పార్టీని ఏమి చేయలేరు. ఢిల్లీలో ఉన్న పార్టీలపై ఆధిపత్యం చేయగలిగే సత్తా మీకు లేదు.. మీరంతా చిల్లర నాయకులు.. ఆ సత్తా కేవలం కేసీఆర్ కే ఉందని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు సీఎమ్ లు అయినట్టుగా ఊహించుకుంటున్నారు.. వాళ్ళు ఊహలకే సరిపోతారని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.