అదృష్టం అంటే ఇదేనేమో.పంచాయతీ పోరులో సర్పంచ్‌గా గెలిచింది మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఇందులో విశేషమేంటంటే ముగ్గురుబిడ్డలున్న ఆమె పదవికి వచ్చే నష్టమేమి లేదు. ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధన. ఈ నిబంధనను పాటించి సర్పంచ్‌గా ఎన్నికైన కొద్దిరోజులకే మూడో బిడ్డకు జన్మనిచ్చి సర్పంచ్ పదవిని కాపాడుకుంది.
జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నెలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 21న జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో గువ్వలదిన్నె సర్పంచ్‌గా పోటీచేసిన మహాదేవి విజయం సాధించారు. సర్పంచ్‌గా గెలిచిన ఆరు రోజుల తర్వాత పాపకి జన్మనిచ్చింది.
ఎన్నికల సమయంలో ఆమె గర్భంతో ఉన్నప్పటికీ.. ఎన్నికలు జరిగే సమయానికి ఆమెకు సంతానం ఇద్దరే ఉండటంతో పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎన్నికల తరువాత మూడో కాన్పు కావడంతో సర్పంచ్‌గా ఆమె ఎన్నిక చెల్లుతుందని అధికారులు తెలిపారు. గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాననని మహాదేవి అన్నారు.