తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు పూర్తి సహాకారం అందిస్తామన్నారు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఐటీ, పరిశ్రమలశాఖ కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ చేపడుతున్న విధానాల పట్ల సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి వచ్చే కంపెనీలకు పూర్తి సహాకారం అందిస్తామని చెప్పారు.కంపెనీలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
త్వరలోనే టీ-వర్క్ రెండో దశ టి-హబ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తో పాటు ఇతర నగరాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తోందన్నారు. ఈ నెల 18న కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై త్వరలోనే పలు కంపెనీల నుంచి అధికారిక ప్రకటనలు వెలువడనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమలశాఖ కమిషనర్ మానిక్ రాజ్, టెక్స్‌టైల్స్ డైరెక్టర్ శైలజా రామాయ్యర్, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.