బీసీసీఐ పై లలిత్ మోదీ బాంబ్!

6
- Advertisement -

బీసీసీఐపై బాంబు పేల్చాడు లలిత్ మోదీ. ఐపీఎల్ అనే ఒక భారీ టోర్నమెంట్‌ను ప్రారంభించాలంటే నాడు శరద్ పవార్ బీసీసీఐ ప్రెసిడెంట్ కావడం ఎంతో అవసరమని అందుకోసం తాము తెరవెనుక ఎంతటి వ్యూహాలు రచించామో ఆయన వివరించారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ చేయాల్సిందిగా మేమే శరద్ పవార్‌ను ఒప్పించాం… మేము ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ఎన్నికలకు వెళ్లాం. కానీ మా సొంత మనుషుల వల్లే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాం. పుణే క్రికెట్ అసోసియేషన్‌లో అజిత్ షిర్కే, జ్ఞానేశ్వర్ అగాషేల మధ్య గొడవ జరిగింది. అగాషేను జగ్‌మోహన్ దాల్మియా వర్గం కొనేసింది. ఆఖరి నిమిషంలో జరిగిన సీక్రెట్ ఓటింగ్‌లో అగాషే ప్లేట్ మార్చడంతో మిస్టర్ పవార్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

ఆ తర్వాత ఏడాది మళ్లీ పోటీ చేశాం. అప్పటికే రాజీవ్ శుక్లా, ఎన్‌. శ్రీనివాసన్ వంటి దిగ్గజాలంతా దాల్మియా వైపే ఉన్నారు. పోరాటం మరింత తీవ్రమైంది. ఓట్ల కోసం బేరసారాలు, కొనుగోళ్లు భారీ స్థాయిలో జరిగాయి అని మోదీ చెప్పారు. నవంబర్ 29 నా పుట్టినరోజు…ఆ రోజు కోల్‌కతాలో ఎన్నికలు జరుగుతున్నాయి. దాల్మియా మమ్మల్ని చాలామందిని డిస్‌క్వాలిఫై (అనర్హులుగా) చేయాలని చూస్తున్నారు. నేను కోర్టులలో పోరాడుతున్నాను… నా తరపున హరీష్ సాల్వే వాదించారు. ఎన్నికలను ఇద్దరు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణలో జరపాలని మేము సుప్రీం కోర్టు నుండి ఒక ముందస్తు ఆర్డర్ సంపాదించాం. ఈ విషయం అక్కడ ఎవరికీ తెలియదు.

సమావేశం మొదలయ్యాక సరైన సమయంలో నేను ఆ సుప్రీంకోర్టు ఆర్డర్‌ను టేబుల్ మీద పెట్టాను. మీరు ఈ కమిటీకి చైర్మన్‌గా ఉండలేరు అని చెప్పడంతో అక్కడ పెద్ద గందరగోళం చెలరేగింది. తలుపులు మూసేశారు…భారీ పోలీస్ బందోబస్తు పెట్టాల్సి వచ్చింది. ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలు లోపలికి నడుచుకుంటూ వచ్చారు. అప్పుడు దాల్మియా వెనక్కి తగ్గక తప్పలేదు. అరుణ్ జైట్లీ లాంటి లాయర్లు కూడా కోర్టుకు వెళ్లి ఈ సమావేశాన్ని ఆలస్యం చేయాలని చూశారు కానీ కుదరలేదు. అరగంటలో ముగియాల్సిన మీటింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగింది.

ఆ మీటింగ్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి బీసీసీఐ సభ్యులు వస్తున్నారు. కొందరు సభ్యులను హోటల్ గదుల్లోనే బంధించారు. మరికొందరు వస్తున్న ఫ్లైట్లను దారి మళ్లించారు. అవును, మేము కూడా వారి వర్గానికి చెందిన కొందరు సభ్యుల విమానాలను వేరే ప్రాంతాలకు దారి మళ్లించాం! ఎందుకంటే అది ఎన్నికలు, ఎలాగైనా గెలవాలి. కానీ, మేము మెరిట్ ప్రాతిపదికన గెలుస్తామనే ధీమా మాకు ఉంది అన్నారు. ఆఖరి ఫలితం గురించి చెబుతూ.. మేము గెలిచాం. ఒక విషయం చెప్పాలి.. రాజీవ్ శుక్లా, అనురాగ్ ఠాకూర్, అరుణ్ జైట్లీ, శ్రీనివాసన్ వీరంతా దాల్మియాకే ఓటేశారు, అయినా వారు ఓడిపోయారు. వారెప్పుడూ పవార్ క్యాంప్‌లో లేరు, వారు దాల్మియా కోర్ గ్రూప్‌లో ఉంటూ డబ్బులు విరజిమ్మారు. కానీ మా గ్రూప్ క్లీన్‌గా, మెరిట్ బేస్‌తో నడిచింది. మేము బీసీసీఐ సభ్యులందరినీ ఒప్పించగలిగాం. అలా నవంబర్ 29న మేము అధికారంలోకి వచ్చాం. ఈ రోజు మనం చూస్తున్న ఆధునిక క్రికెట్ విప్లవానికి అదే అసలైన ఆరంభం అని లలిత్ మోదీ సంచలన విషయాలు బయటపెట్టారు.

Also Read:మోదీకి నచ్చిన..’పెద్ది’!

- Advertisement -