ప్రారంభానికి సిద్ధ‌మైన‌ కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం

59
monkey

రాష్ట్రంలోనే ‌తొలి కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం ప్రారంభానికి సిద్ధ‌మైంది. నిర్మ‌ల్ జిల్లా కేంద్రానికి స‌మీపంలో సారంగాపూర్ మండలం చించోలి (బి) ద‌గ్గ‌ర‌ ఏర్పాటు చేసిన కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఈ నెల 20న ప్రారంభించ‌నున్నారు. దేశంలో హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ లో ఏర్పాటు చేసిన కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం మొద‌టి కాగా, తెలంగాణ రాష్ట్రంలోనే ఇది తొలి పున‌రావాస శిబిరం. రూ. 2.25 కోట్ల అట‌వీ శాఖ నిధులతో ఈ ‌ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కోతులను తొలుత సంరక్షణ, పునరావాస కేంద్రానికి తీసుకొస్తారు. గ్రామాల్లో ఉండే కోతుల‌ను బంధించి, అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించ‌డం గ్రామ‌పంచాయ‌తీల‌ బాధ్య‌‌త‌. త‌ర్వాత అట‌వీ శాఖ అధికారులు వాన‌రాల‌ను అక్క‌డి నుంచి పునరావాస, రక్షణ కేంద్రాల‌కు త‌ర‌లిస్తారు. అక్క‌డ విపరీతంగా పెరిగిపోతున్న వానరాల సంతతిని అరికట్టేందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ద్వారా కోతుల సంఖ్యను తగ్గించే చర్యలు చేపడతారు. ఇక కోతులకు ఇష్టమైన పండ్ల చెట్లను కూడా ఈ కేంద్రంలో పెంచారు. దశల వారీగా కోతులను పట్టుకొచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు. అవి పూర్తిగా కోలుకున్నాకా మ‌ళ్ళీ అడ‌వుల్లో వ‌దిలేస్తారు.

ఈ కేంద్రంలో పశువైద్యాధికారి, సహాయకులతో పాటు ఓ ప్రయోగశాల, ఆప‌రేష‌న్ థియేట‌ర్, డాక్ట‌ర్స్ రెస్ట్ రూమ్స్, ఇత‌ర‌ పరికరాలను ఏర్పాటు చేశారు. కోతులను ఉంచేందుకు ప్రత్యేకంగా బోనులను సైతం తయారుచేశారు. సిబ్బంది అక్కడే ఉండేలా వసతి గృహాన్ని సైతం నిర్మించారు.

నిర్మల్‌ ప్రజలకు కోతులతో ఏండ్ల నాటి అనుబంధం ఉంది. చారిత్రాత్మక ప్రాంతాలు, కోటలు, ఖిల్లలు, బురుజులు, చెరువులతో పాటు చుట్టూ అటవీ ప్రాంతం ఉండడంతో ఈ ప్రాంతం కోతులకు ఆవాసంగా మారింది. చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడం, అటవీ ప్రాంతం అంతరించడంతో కోతులు నివాసం కోల్పోయాయి. ఆహారం కరువై జనావాసాల్లోకి రావడం మొదలు పెట్టాయి. కొద్ది సంఖ్యలో ఉన్న కోతుల సంఖ్య పెరగడంతో బెడదగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన పట్టణం-మన ప్రణాళిక పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమస్యలపై కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ అశోక్‌తో కలిసి ఈ ప్రాంత మేధావులు, నాయకులు, వ్యాపారస్తులతో కలిసి చర్చించారు. ఇతర అంశాలతో పాటు ఎక్కువగా కోతుల బెడద అంశాన్ని లేవనెత్తారు. కోతుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండటంతో పంటలకు రక్షణలేకుండా పోయిందని, మానవ జీవనాన్ని అవి ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అప్ప‌టి తెలంగాణ అటవీ సంరక్షణ ముఖ్య ధికారి (పీసీసీఎఫ్‌) పీకే శర్మకు నివేదించారు.

ఈ సమస్య పరిష్కరించాలని శ‌ర్మ‌ ప్రభుత్వాన్ని కోరారు.వాటి బెడద నివారణకు వాటి కోసం మంకీ రెస్క్యూ, రిహాబిలిటేషన కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో వేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ క్రమంలో పైలట్ ‌ప్రాజెక్టుగా తొలి కేంద్రం ఏర్పాటుకు అనుమతిచ్చింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం కోతుల సంక్షరణ కేంద్రాన్ని మంజూరు చేసింది.

సహ్యాద్రి పర్వతాల మధ్య వెలసిన నిర్మల్‌ పట్టణం చుట్టూ ఎత్తైన గుట్టలు, ఏపుగా పెరిగిన వృక్షసంపద అందుబాటులో ఉంది. దీంతో ఇది సహజంగానే కోతులకు ఆవాసంగా మారింది. పైగా జనావాసాలకు దూరంగా అటవీప్రాంతం ఉండటంతో ఇక్కడ వానరాల పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావించింది. ఈ క్ర‌మంలో నిర్మల్ ప‌ట్ట‌ణానికి సమీపంలోని చించోలీలో తొలి పునరావాస కేంద్రం ఏర్పాటుకు అనుమతినిస్తూ మే 7, 2016లో అటవీశాఖ ఉత్తర్వులు జారీచేసింది.పునరావాస కేంద్రం ఏర్పాటుకు‌ రూ.2.25 కోట్ల నిధులను విడుదల చేసింది. అనంత‌రం నవంబరు 20, 2017న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్రం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.

వనాలు పెరగాలి.. కోతులు ఆ వనాలకు తరలాలి అన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా ఈ కేంద్రం పనిచేస్తుంది. ఇందులో భాగంగా హరితహారం పథకం కింద ఈ భవనం చుట్టుపక్కల విరివిగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లుచేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కోతులను తొలుత ఈ కేంద్రానికి తీసుకొస్తారు. కనీసం వారం రోజుల పాటు ఈ కేంద్రంలో ఉంచి ఇక్కడి వాతావరణానికి అలవాటు చేస్తారు. తదనంతరం వాటికి కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు.