జనతా గ్యారేజ్, మనమంతా, మన్యం పులి వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్లు అందుకున్నారు మోహన్‌లాల్. ఇదే స్పీడ్‌లో అటు మలయాళంలో, ఇటు తెలుగులో వరుసగా క్రేజీ అవకాశాలు అందుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో కీలకమైన రోల్స్ ప్లే చేస్తూ తన హవా చాటుతున్నారు. దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు! అన్నట్టే లాల్ అటూ ఇటూ రఫ్ఫాడించేస్తున్నాడు. తాజాగా మోహన్‌లాల్ నటించిన మలయాళ సూపర్‌హిట్ `రన్ బేబి రన్` తెలుగులోకి `బ్లాక్‌మనీ`. `.. అన్నీ కొత్త నోట్లే` అన్న పేరుతో అనువాదమై రిలీజవుతోంది. నిజామ్ సమర్పణలో మాజిన్ మూవీమేకర్స్ పతాకంపై సయ్యద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బృందం `క్లీన్ యు` సర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది.
ఈ సందర్భంగా నిర్మాత నిజాముద్దీన్ మాట్లాడుతూ -“మోహన్‌లాల్ తెలుగులో వరుస సక్సెస్‌లతో జోరుమీదున్నారు. ఈ జోరు ఇక మీదటా కొనసాగించనున్నారు. తాజా చిత్రం మీడియా నేపథ్యంలోనిది. లాల్ ఓ టీవీచానెల్ కెమెరామేన్‌గా నటించారు. కథానాయిక అమలాపాల్ సీనియర్ ఎడిటర్ రేణుక పాత్రలో నటించారు. సంబంధ బాంధవ్యాలు, వృత్తిపరమైన సంఘర్షణ చుట్టూ కథాంశం తిరుగుతుంది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రమిది. తెలుగు వెర్షన్ అనువాదం సహా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. త్వరలోనే మంచి రిలీజ్ తేదీ చూసి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నాం“ అని తెలిపారు. రతీష్ వేఘ సంగీతం, ఆర్‌డి రాజశేఖర్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి జోషి దర్శకత్వం వహించారు. వెన్నెలకంటి సంభాషణలు అందించారు.