భారత్ ఇప్పటికే హిందూ దేశమేనని, దాన్ని ప్రకటించడానికి ఎలాంటి రాజ్యాంగ ఆమోదం అవసరం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధిపతి మోహన్ భాగవత్ సంచలన కామెంట్స్ చేశారు. కోల్‌కతాలో జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూ, పూర్వీకుల గొప్పతనాన్ని గుర్తుంచుకుంటున్నంతకాలం ఇది ఒక స్పష్టమైన నిజంగానే ఉంటుందని పేర్కొన్నారు.
సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. అది ఎప్పటి నుంచి జరుగుతోందో మనకు తెలియదు. దానికి కూడా రాజ్యాంగ ఆమోదం కావాలా? హిందుస్తాన్ ఒక హిందూ దేశం అని ఏఎన్‌ఐని ఉద్దేశించి భాగవత్ వ్యాఖ్యానించారు. భారత్‌ను తన మాతృభూమిగా భావించే ప్రతి ఒక్కరూ భారతీయ సంస్కృతిని గౌరవిస్తారు. భారత పూర్వీకుల మహిమను కనీసం ఒక్కరు అయినా ఆదరిస్తున్నంతకాలం భారత్ హిందూ దేశంగానే ఉంటుంది అని ఆయన చెప్పారు.
ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజకీయ అజెండా లేదని భాగవత్ స్పష్టం చేశారు. హిందూత్వం ఎదుగుదలపై భయపడే కొంతమంది కారణంగా దేశవిరోధి, సంఘ్ వ్యతిరేక ప్రచారం పెరిగింది. ఆర్‌ఎస్‌ఎస్‌పై అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం ప్రతి ఒక్కరి హక్కే. కానీ అవి వాస్తవాల ఆధారంగా ఉండాలి, కథనాలపై లేదా ద్వితీయ సమాచారంపై కాకూడదు అని అన్నారు. హిందూత్వ సిద్ధాంతాన్ని అనుసరించే ఆర్‌ఎస్‌ఎస్‌కు భారత్‌ను హిందూ దేశంగా నిర్వచించడానికి ఎలాంటి చట్టపరమైన లేదా పార్లమెంటరీ సవరణలపై ఆధారపడాల్సిన అవసరం లేదని భాగవత్ తెలిపారు.
పార్లమెంట్ ఎప్పుడైనా రాజ్యాంగంలో ఆ పదాన్ని చేర్చాలని నిర్ణయిస్తే సరే, చేర్చకపోయినా సరే. మాకు పట్టదు. ఎందుకంటే మేము హిందువులం, మా దేశం హిందూ దేశం. అదే నిజం అని అన్నారు. జన్మ ఆధారిత కుల వ్యవస్థ హిందూత్వంలో భాగం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రజలు రోజువారీ జీవితంలో మాతృభాషను ఉపయోగించాలని భాగవత్ పిలుపునిచ్చారు. మీరు బెంగాలీ మాట్లాడేవారైతే, ఇంటి ప్రవేశద్వారంలో ‘వెల్‌కమ్’ బదులు ‘స్వాగతం’ అని రాయండి అని సూచించారు. మేము ముస్లింలకు వ్యతిరేకమనే భావన మీకు ఉంటే, మీరు వచ్చి స్వయంగా చూడండి. నిజంగా అలాంటిదేమైనా కనిపిస్తే మీ అభిప్రాయాన్ని కొనసాగించండి. కనిపించకపోతే, మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి అని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు.
Also Read:TTD:గౌహతిలో శ్రీవారి ఆలయం

