మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్‌ఆర్ఈజీఏ) బలహీనపరుస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎంజీఎన్‌ఆర్ఈజీఏ విధ్వంసం అనేది సమాజం ఎదుర్కొంటున్న సమష్ఠి నైతిక వైఫల్యమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ చట్టం నిర్వీర్యం కావడం గ్రామీణ భారతంలో జీవనాధారంగా ఉన్న కోట్లాది కుటుంబాలకు తీవ్రమైన విపత్తుగా మారుతుందని హెచ్చరించారు.
‘ది బుల్డోజర్ డిమెలిషన్ ఆఫ్ ఎంజీఎన్‌ఆర్ఈజీఏ’ అనే శీర్షికతో ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసంలో సోనియా గాంధీ తన ఆందోళనను వ్యక్తం చేశారు. ఎంజీఎన్‌ఆర్ఈజీఏ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని, గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి భద్రత, గౌరవాన్ని కల్పించిన హక్కుల ఆధారిత చట్టమని పేర్కొన్నారు. ఇది మహాత్మా గాంధీ ప్రజా సంక్షేమ దృష్టిని ప్రతిబింబించడమే కాకుండా రాజ్యాంగబద్ధమైన పని హక్కును అమలు చేసిన చట్టమని గుర్తు చేశారు. ఈ చట్టం బలహీనపడితే రాబోయే సంవత్సరాల్లో కోట్లాది కార్మిక కుటుంబాలపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
దేశంలో ప్రజల హక్కులు క్రమంగా నిర్వీర్యమవుతున్నాయని సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ విద్యా విధానం–2020 కారణంగా దాదాపు లక్ష ప్రాథమిక పాఠశాలలు మూతపడటంతో విద్య హక్కు దెబ్బతిందన్నారు. అలాగే అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చడం, గ్రామ సభ పాత్రను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచారని ఆరోపించారు. భూమి సేకరణ, పునరావాస చట్టం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌ను కూడా నిర్వీర్యం చేశారని విమర్శించారు. వ్యవసాయ చట్టాల ద్వారా రైతుల కనీస మద్దతు ధర హక్కును దూరం చేయాలన్న ప్రయత్నం జరిగిందని గుర్తు చేశారు. ఇకపై జాతీయ ఆహార భద్రత చట్టం కూడా లక్ష్యంగా మారే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల హక్కులను కాపాడేందుకు ఐక్యత అత్యవసరమని సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఎంజీఎన్‌ఆర్ఈజీఏను బలహీనపరచడం ద్వారా రైతులు, కూలీలు, భూమిలేని పేదలపై కేంద్ర ప్రభుత్వం దాడి చేసిందని ఆరోపించారు. ఈ హక్కుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
Also Read:‘ధురంధర్’..ఓటీటీ డేట్ లాక్!

