స్టేజీ నాటకాల దగ్గరి నుంచి సిల్వర్ స్క్రీన్ దాకా.. పాలకొల్లు నుంచి పార్లమెంటు వరకు.. దాసరి నారాయణరావు జీవితం ఓ సుదీర్ఘ ప్రయాణం. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం.. మూడు దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ఎంతోమంది శిష్యులను ఆయన తీర్చిదిద్దారు. వ్యక్తులెవరైనా ఆయన చేతిలో పడ్డారంటే కెరీర్‌కు టర్నింగ్ పాయింటే అన్న అభిప్రాయం ఉండేది. అలాగే మోహన్ బాబు లాంటి గొప్ప శిష్యులని తయారుచేసుకున్నారు. సినీ దర్శకుడిగా ఎంతో మంది హీరోలకు దాసరి లైఫ్ ఇచ్చారు.
దాసరి ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి ఆయన యోగక్షేమాలు చూసుకుంటూ వస్తున్న మోహన్ బాబు.. ఇక ఆయన లేరనే నిజం తెలుసుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. దాసరి అంత్యక్రియల సందర్భంగా.. మోహన్ బాబు అంతా తానై ఏర్పాట్లు చూసుకున్నారు. అయితే దాసరి పార్థివదేహాన్ని చివరిసారి చూసేందుకు ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు రాకపోవడంపై నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు… మరి, ఆయన చనిపోయినప్పుడు ఎంత మంది వచ్చారో లెక్కిస్తే, గుండె తరుక్కుపోతుందని అన్నారు.
సహాయక పాత్రలు చేసుకునే ఎంతో మందిని ఆయన హీరోలుగా చేశారన్నారు. ఎంతో మంది హీరోయిన్లకు గుర్తింపును తీసుకొచ్చారని.. ఎంతో మందికి దాసరి సహాయం చేశారని… వారంతా దాసరిగారిని కడసారి చూసేందుకు ఎందుకు రాలేకపోయారని అన్నారు. తాను ఎవరి పేరును చెప్పనని… కానీ, వారు చేసింది మాత్రం చాలా దారుణమని అన్నారు. ఊర్లో లేనివారి గురించి మనం మాట్లాడకూడదని… కానీ, అందుబాటులో ఉండికూడా, రాకపోవడం సరైనది కాదని చెప్పారు. గురువుగారు చనిపోయినప్పుడు పరిశ్రమ పట్టించుకోలేదన్నది వాస్తవమన్నారు. ఇటువంటి గొప్పవ్యక్తికి, మేథావికి ఇలానా అంతిమ వీడ్కోలు పలికేది? నిజంగా ఇది దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చావు ప్రతి ఒక్కరికీ వస్తుందనీ… ఆ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు.