ఆసీస్ చిరస్మరణీయ సిరీస్‌ను ఎన్నటికీ మరిచిపోలేనని తెలిపాడు హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్. ఆసీస్ టూర్‌లో తన ప్రదర్శన పట్ల తనకు ఎంతో సంతోషంగా ఉందని, భారత్ విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించడం ఎన్నటికీ మర్చిపోలేనని తెలిపాడు. ఆసీస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన సిరాజ్… ఒకవేళ తన తండ్రి బ్రతికే ఉంటే ఆయన ఎంతో సంతోషించేవాడని, నా కండ్లల్లో నీళ్లు వచ్చాయని వెల్లడించారు.
ఇండియా ఏకు ఆడడం వల్ల తనకు మంచి అనుభవం వచ్చిందని…. తండ్రి మరణవార్త విన్న తర్వాత చాలా డిస్టర్బ్ అయ్యానని, ఆస్ట్రేలియా నుంచి ఇంటికి వెళ్లాలా వద్దా అన్న మీమాంసలో ఉండిపోయానని, కానీ నాన్న ఆశయాలను తీర్చాలని అమ్మ, సోదరుడు ఫోన్‌లో చెప్పినట్లు సిరాజ్ గుర్తు చేసుకున్నాడు. తాను ఒంటరిగా ఎంతో మనోవేదనకు గురైనట్లు తెలిపాడు. మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, హైదరాబాద్ టీమ్ కోచ్ భరత్ అరున్ ఇచ్చిన సూచనలు తనకు ఎంతో ఉపకరించాయన్నాడు.
ఆస్ట్రేలియా ప్రేక్షకులు తనపై మాటలతో దాడి చేసినట్లు చెప్పాడు. బ్రౌన్ మంకీ తరహాలో కనిపిస్తున్నట్లు తనను వాళ్లు కించపరిచారన్నాడు. బ్రేక్ లేకుండా ప్రేక్షకులు తనపై దూషణలకు దిగారని, అయితే దాన్ని నేను సహించలేకపోయానని, అందుకే అంపైర్లకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు.