పాక్‌కు వాల్ స్ట్రీట్ వార్నింగ్‌..

261
Modi’s Restraint Toward Pakistan
Modi’s Restraint Toward Pakistan
- Advertisement -

ఉరీ ఘటనల నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత్‌ తెస్తున్న ఒత్తిడిపై అంతర్జాతీయ సమాజం స్పందిస్తోంది. ఇప్పటికే యూఎన్‌లో పాకిస్తాన్‌ వైఖరిని ఎండగట్టిన భారత్‌కు పలు దేశాలు మద్దతు తెలిపాయి. అదేవిధంగ పాకిస్తాన్‌ను పెంచి పోషిస్తున్న అగ్రరాజ్యం అమెరికా సైతం సిద్దమయ్యింది. పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని ఇద్ద‌రు చ‌ట్ట‌సభ ప్ర‌తినిధులు అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు ప్ర‌వేశ‌పెట్టడమే ఇందుకు ఉదాహరణ. రిప‌బ్లిక‌న్ పార్టీకి చెందిన టెడ్ పో, డెమొక్ర‌టిక్ పార్టీకి చెందిన డానా రోహ్ర‌బాక‌ర్ ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. పాకిస్థాన్‌కు చేస్తున్న సాయాన్ని వెంట‌నే నిలిపి వేయాలని, ఆ దేశాన్ని ఉగ్ర‌వాద దేశంగా ప్ర‌క‌టించాలని ఉగ్ర‌వాదంపై హౌజ్ స‌బ్ క‌మిటీ చైర్మ‌న్ కూడా అయిన‌ టెడ్ పో అన్నారు.తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ తొలిసారిగా పాకిస్థాన్‌ను హెచ్చరిస్తూ ఓ కథనం రాసింది.

modi

ఉగ్రవాదం విషయంలో భారత్ నైతిక విలువలను ఎప్పుడూ పాటిస్తూనే ఉందని, కానీ ఆ విషయాన్ని గట్టిగా చెప్పడానికి గతంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ధైర్యం చేయలేకపోయాయని ఆ కథనం పేర్కొంది. ఆ వ్యూహాత్మక మౌనం వల్ల పాకిస్థాన్‌ ఎన్నిసార్లు దాడులకు పాల్పడినా.. ఆ ఉగ్రవాదానికి ఎప్పుడూ బాధ్యురాలిగా చేయలేదని కూడా తెలిపింది. భారత ప్రధాని నరేంద్రమోదీ స్నేహహస్తం చాస్తున్నారని, దాన్ని నిరాకరిస్తే మాత్రం పాక్ ఓ పనికిమాలిన దేశంగా మిగిలిపోతుందని తెలిపింది.

భారతదేశం వ్యూహాత్మకంగానే సహనం పాటిస్తోందని, కానీ దాన్ని అలుసుగా తీసుకుంటే నష్టపోయేది పాకిస్థానేనని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. మోదీ ప్రస్తుతానికి సహనం పాటిస్తున్నారని, కానీ ఇస్లామాబాద్ ఈ వైఖరి ఎక్కువకాలం అవలంబించడం సరికాదని, అలా చేస్తే ఇప్పుడు ఉన్నదానికంటే పనికిరాని దేశంగా పాక్ మిగిలిపోతుందని చెప్పింది. సరిహద్దుల్లో ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరాను పాక్ కొనసాగిస్తే, భారత ప్రధానమంత్రి దానికి గట్టిగా సమాధానం చెప్పగలరని.. అయితే ఇప్పటికిప్పుడు ఎలాంటి సైనిక చర్య తీసుకోకూడదన్న ప్రధాని మోదీ నిర్ణయాన్ని వాల్ స్ట్రీట్‌ ప్రశంసించింది.

దానికి బదులు పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. 1960 నాటి సింధు నదీజలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను తప్పించడం లాంటి చర్యల ద్వారా పాక్‌ను అణగదొక్కే ప్రయత్నాలపై ఆలోచిస్తున్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

- Advertisement -