అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. యూపీ లక్నోలోని రామాబాయ్ సభాస్థల్‌లో నిర్వహించిన యోగా డే వేడుకలలో ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. యోగా నిపుణుల పర్యవేక్షణలో వారి సూచనల ప్రకారం వేలాది ఔత్సాహికులతో కలిసి మోడీ, యోగి పలు రకాల యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ యోగాతో ప్రపంచమంతా భారత్‌తో మమేకమైందన్నారు. యోగాతో పైసా ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చన్నారు. యోగా సాధన రుషులు, మహర్షుల నుంచి సామాన్యుల వరకు అందరికీ ఉపయోగకరమన్నారు. యోగా శిక్షకులకు అద్భుత అవకాశాలు ఏర్పడ్డాయన్నారు. అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం.. అది యోగా వల్లనే సాధ్యమవుతుందని మోడీ పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను భాగం చేసుకోవాలని’ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు మోడీ. యోగాలో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయని, ప్రతిరోజు తప్పనిసరిగా యోగా చేయడం ద్వారా అందరూ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రధానితో సహ ఔత్సాహికులు వర్షంలోనే యోగాసనాలు వేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యోగా చేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మోదీ అభినందనలు తెలిపారు.