వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర వైఫల్యం: మంత్రి కేటీఆర్

123
ktr
- Advertisement -

వాక్సినేషన్ కార్యక్రమం పైన ప్రజల నుంచి సలహాలను, సూచనలను మంత్రి కే తారకరామారావు ఈరోజు స్వీకరించారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో కోనసాగిన ట్విట్టర్ సంభాషణలో మంత్రి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తు, ప్రజల నుంచి వచ్చిన విలువైన సలహాలు పైన సూచనలు పైన స్పందించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలను ప్రజలకు వివరించారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ పక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నదని, ఓల్డ్ ఏజ్ హోమ్ ల్లోనూ వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు పది లక్షల మంది ప్రజలకు వ్యాక్సిన్ను వేసే పరిపాలనా పరమైన వ్యవస్థ అందుబాటులో ఉన్నదని అయితే దురదృష్టవశాత్తు ఆ మేరకు అవసరమైన వ్యాక్సిన్ సరఫరా లేదన్నారు. సాధ్యమైనంత త్వరగా అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి ఉందని, కానీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం వలన ఈ ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లను సమకూర్చు కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అయితే దురదృష్టవశాత్తు రాష్ట్రం పిలిచిన గ్లోబల్ టెండర్లకు స్పందన రాలేదన్నారు. అంతర్జాతీయ వ్యాక్సిన్ తయారీదారులు దేశంలోని వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే కన్నా కేవలం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు, కేంద్రానికే వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వాక్సినేషన్ విషయంలో ఏజ్ గ్రూపుల వారీగా నిర్ణయం తీసుకోవడం కొంత అయోమయానికి దారితీస్తుందని, దీని బదులు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధంగా సూపర్ స్పైడర్ లను గుర్తించి వారికి వాక్సినేషన్ వేయడం ద్వారా మరిన్ని సత్ఫలితాలు పొందే అవకాశం ఉందని, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు 30 లక్షల మందిని గుర్తించిందని, వారికి సంబంధించిన వాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ముఖ్యంగా విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు వెళ్లే వారి కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం ద్వారా వారి యొక్క విలువైన విద్యా సమయం సేవ్ అవుతుందన్నారు. ప్రజలకు 2 డోసుల వ్యాక్సిన్ అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనసాగిస్తున్నామని ఇప్పటికే 13న లక్షల మందికి రెండో డోసు పూర్తి అయింది అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 65 లక్షల మందికి వాక్సిన్ అందించామని అన్నారు.

భారతదేశ జనాభా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందించాలంటే 272 కోట్ల వాక్సిన్ అవసరం అవుతాయని దీనికి సంబంధించి 150 రూపాయలకు ఒక వ్యాక్సిన్ డోసు చొప్పున కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన 35 వేల కోట్ల రూపాయలను ఉపయోగించాలని, కానీ ఈ బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఎక్కడికి పోయాయో అర్థం కావడం లేదన్నారు. దీంతో పాటు రాష్ట్రాలకు, ప్రవేట్ కంపెనీలకు, కేంద్ర ప్రభుత్వానికి ఒక తీరున వ్యాక్సిన్ ధరను నిర్ణయించడం పైన కూడా ఆయన ట్విట్టర్లో స్పందించారు. దీంతోపాటు దేశంలో ఉత్పత్తి అవుతున్న వక్సిన్లు 85 శాతం కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉన్నాయని మిగిలిన 15 శాతం లో రాష్ట్రాలకు తక్కువ రేటు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఎక్కువ రేటు నిర్ణయించడంతో కంపెనీలు కూడా ప్రైవేటు వర్గాలకే అమ్మేందుకు ముందుకు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు సుముఖంగా లేవన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. పైగా రాష్ట్ర ప్రభుత్వాలకు మే 1 తర్వాతనే ఆర్డర్లను కంపెనీలకు అందించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. మూడవ కరోనా నేపథ్యంలోనూ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరాకు సంబంధించిన ఒక ప్రణాళిక ఉందా లేదా అన్న అనుమానం కలుగుతుందన్నారు. భారత దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సిరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ నెలకి పది కోట్లకు మించి ఉత్పత్తి చేయలేవని, అయితే త్వరలోనే దేశ జనాభాలో 80శాతం ఉన్న 18 నుంచి 45 సంవత్సరాల వయసున్న ప్రజలకు ఏ విధంగా రెండు డోసులు అందుతాయో కేంద్ర ప్రభుత్వం తెలపాలన్నారు.

దేశీయంగా వ్యాక్సిన్ సరఫరా తగినంత లేకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం అమెరికా కెనడా డెన్మార్క్ నార్వే వంటి దేశాల్లో నిరుపయోగంగా ఉన్న 50 కోట్ల వ్యాక్సిన్లకు సంబంధించి ఆయా దేశాలతో వెంటనే చర్చను ప్రారంభించి వాటిని భారతదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించాలని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. దేశంలో వ్యాక్సిన్లు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా ప్రజలకు ఎందుకు అందుబాటులో లేవన్న విషయానికి సంబంధించి మంత్రి కేటీఆర్ పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. ఇతర దేశాలు గత సంవత్సరమే మేల్కొని పెద్దఎత్తున ఆయా కంపెనీలకు వ్యాక్సిన్లు సరఫరా కోసం ఆర్డర్ ఇచ్చాయని, అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరిలో మేల్కొన్న దన్నారు. దీంతో పాటు ఇతర దేశాలు తమ ప్రజలకి పెద్దఎత్తున వ్యాక్సిన్ సరఫరాను అందించే ప్రయత్నం చేస్తుంటే భారత సర్కారు మాత్రం వ్యాక్సిన్ మైత్రి మరియు విదేశాలకు వాక్సిన్ ఎగుమతుల ప్రమోషన్ లకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి ఉందన్నారు. అమెరికా కెనడా వంటి దేశాలు తమ దేశ జనాభాకు అవసరమైన వాటి కన్నా ఎక్కువగానే వ్యాక్సిన్లను ప్రోకూర్ చేసుకున్నాయని, ముఖ్యంగా కెనడా లాంటి దేశం ఒక వ్యక్తికి తొమ్మిది డోసు ల చొప్పున వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

వ్యాక్సిన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్థిస్తున్న అంధ భక్తులకు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పలు చురకలంటించారు. అమెరికా ఇజ్రాయిల్ లాంటి దేశాలు సగానికి పైగా జనాభా కి వ్యాక్సిన్ అందిస్తే భారతదేశ వ్యాక్సిన్ ప్రక్రియ కనీసం 10 శాతం కూడా దాటలేదన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు ముఖ్యంగా ఆస్ట్రేలియా, అమెరికా, యుకె ,జర్మనీ, ఫ్రాన్స్, చైనా వంటి దేశాలన్నీ తమ పౌరులకు వాక్సిన్ ఉచితంగా అందిస్తే భారతదేశంలో మాత్రం ఇందుకు భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్ వేస్టేజ్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పుడు అతి తక్కువ గా ఉందన్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ కరోనా వస్తే పిల్లల పైన అత్యధిక ప్రభావం చూపుతుందన్న భయాందోళన నేపథ్యంలో వారికి వ్యాక్సిన్ ఏమైనా అందుబాటులోకి వస్తుందా అన్న ప్రశ్నకు సమాధానంగా వ్యాక్సిన్ కి సంబంధించిన ట్రాయల్స్ ప్రారంభమైనట్టు, దీంతో విదేశాల్లోనూ పలు ఇతర కంపెనీలు కూడా పిల్లలపైన వాక్సిన్ ట్రాయల్స్ ను ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు.

- Advertisement -