మోడి తొలి కేబినేట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు ఇవే..

312
Modi
- Advertisement -

ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో ఇవాళ తొలి సారి సమావేశమైన కొత్త కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల‌కు పెద్ద పీఠ వేస్తూ ప్రధాన మంత్రి కిసాన్‌ పెన్షన్‌ యోజన పథకం అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ నిర్ణయంతో ఇకపై అదనంగా రెండు కోట్ల మంది రైతులు ఈ పథకం కింద పెన్షన్‌ పొందే వీలు కలగనుంది. కేబినెట్‌ తాజా నిర్ణయంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 14.5 కోట్లకు చేరుతుంది.

గత ఏడాది ఈ పథకానికి రూ.75వేల కోట్లు ఖర్చవగా ఇకపై 13 వేల కోట్లు అదనంగా ఖర్చు కానుంది. ఈ ప‌థకం కింద రైతులంద‌రికి ఏడాదికి 6 వేల రూపాల‌య చొప్పున ఆర్థిక సాయం అంద‌నుంది. కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలను సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ మీడియాకు వెల్లడించారు.

Modi

ఇక ఉగ్రదాడులు, నక్సల్స్‌ దాడుల్లో అమరులైన జవాన్ల పిల్లలకు నెలనెలా భారత రక్షణ నిధి నుంచి ఇచ్చే ఉపకార వేతనాల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు. బాలురకు నెలకు ఇచ్చే రూ.2వేల ఉపకారవేతనాన్ని రూ.2500లకు పెంచారు. అలాగే, బాలికలకు ఇచ్చే రూ.2250ను రూ.3వేలకు పెంచాలని నిర్ణయించారు. ఇప్పటివరకు కేంద్ర, పారామిలటరీ బలగాలకు మాత్రమే ఉన్న ఈ ఉపకార వేతనాలను ఇకపై రాష్ట్రాలకూ విస్తరించాలని నిర్ణయించారు. ఏడాదికి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన వారిని ఎంపిక చేయనున్నారు.

అదే విధంగా ప్రధాని కార్యాలయంలో మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో హోంమంత్రి అమిత్‌షా సహా 24మంది కేబినెట్‌ మంత్రులు, 9మంది స్వతంత్ర హోదా కల్గిన మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. నూతన ప్రభుత్వంలో జూన్‌ 17 నుంచి జూలై 26 వరకు పార్లమెంట్‌ తొలి సమావేశాలు నిర్వహించాలని కేంద్రమంత్రి మండలి నిర్ణయించింది.

జూన్‌ 19న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక చేపట్టనున్నారు. మొదటి సమావేశంలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భేటీలో నిర్ణయించారు. జులై 4న ఆర్థికసర్వే విడుదల చేసి జులై 5న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు జావడేకర్‌ వెల్లడించారు. జూన్‌ 20న ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తారు.

- Advertisement -