గుజరాత్‌లో ఘనంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అధికారికంగా శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని, అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీ తీరంలో జరుగుతున్న ఈ రంగుల పండుగలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ కూడా పాల్గొనడం విశేషంగా నిలిచింది. ఇద్దరూ కలిసి పతంగులను ఎగురవేసి వేడుకను ప్రారంభించారు.
ప్రతి ఏటా మకర సంక్రాంతి సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం నిర్వహించే ఈ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ ఉత్సవంలో దేశ, విదేశాల నుంచి వచ్చిన కైట్ ఆర్టిస్టులు, పర్యాటకులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఏడాది కూడా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ ప్రత్యేక పతంగులతో ఆకట్టుకున్నారు.
సబర్మతి నదీ తీరంలో ఆకాశం నిండా రంగురంగుల పతంగులు ఎగురుతుండటంతో పండుగ వాతావరణం నెలకొంది. ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ గుజరాత్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తోందని అన్నారు. అలాగే ఇది దేశాల మధ్య స్నేహబంధాలను మరింత బలోపేతం చేసే వేదికగా మారిందని పేర్కొన్నారు.
Also Read:ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం

