సంచార పశు వైద్యశాలను ప్రారంభించిన సీఎం…

281
- Advertisement -

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం తొలిసారి సంచార పశు వైద్యశాలలను ప్రారంభించింది. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో సంచార పశు వైద్యశాలలను ప్రారంభించారు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా సంచార పశు వైద్యశాలను తీసుకొచ్చామన్నారు.

వచ్చే ఏడాది నుంచి రైతులకు రూ. 8వేల పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. రైతు సమన్వయ సమితులు రైతులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటాయన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే రైతు సమన్వయ సమితులున్నాయని వెల్లడించారు. ఏడాదిలో 7 జిల్లాలకు కాళేశ్వరం నీటిని అందిస్తారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ స్వయంగా  టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1962కి ఫోన్ చేసినప్పుడు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రైతు ప్రతినిధిగా కాల్ సెంటర్ ప్రతినిధితో మాట్లాడిన సీఎం మీరు ఇక్కడికి ఎంత సేపటిలో రాగలరని ప్రశ్నించగా 30 నిమిషాల్లో రాగలమని సదరు ప్రతినిధి తెలిపింది. మీ పశువుకి ఏమైందని అడగగా ఇక్కడ పశువు లేదమ్మా సీఎం అనగానే అందరిలో మొఖాల్లో నవ్వులు విరిశాయి. ఇది ప్రారంభోత్సవం.. కంగ్రాజులేష్యన్స్ గో హెడ్ అంటూ సీఎం ఫోన్ పెట్టేశారు.

ప్రతీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున వంద సంచార పశు వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చింది. సంచార పశువైద్యశాలల సేవల కోసం ప్రత్యేకంగా 1962 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటుచేసింది.  ఫోన్‌ చేసిన అరగంటలో వెటర్నరీ వైద్యులు సంబంధిత స్థలానికి చేరుకుని వైద్య సేవలు అందించనున్నారు.  ప్రతి సంచార పశువైద్యశాల వాహనంలో అవసరమైన పరికరాలు, మందులు, ఒక పశువైద్యుడు, పారా వెటర్నరీ సిబ్బంది, ఒక సహాయకుడిని నియమించారు. అత్యవసరమైతే పశువులకు శస్త్రచికిత్సలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సంచార పశు వైద్యశాల నిర్వహణ మరియు మందుల కొనుగోలుకు రూ. 30 కోట్లు కేటాయింపు చేసిన ప్రభుత్వం రైతులకు ఉచిత సేవలను అందిస్తుంది.

ఈ   కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ర్ట గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ రాజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -