MMTS రైళ్లు రద్దు..పోలీసులు హై అలర్ట్..!!

72
agnipath sec bad
- Advertisement -

అగ్నిప‌థ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. ఆందోళనకారులు మూడు రైళ్లను అంటుబెట్టారు, విలువైన ప్రభుత్వ ఆస్థులను ద్వంసం చేశారు. దాదాపు రూ.20 కోట్ల మేర నష్టం జరిగిందని సౌత్‌సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ తెలిపారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడగా, ఓ యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడిన వారిని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. రాష్ట్రంలోని నాంపల్లి రైల్వే స్టేషన్‌ తో పాటు అన్ని రైల్వే స్టేషన్లలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. స్టేషన్‌లోకి ఎవరినీ అనుమంతించడం లేదు. అదేవిధంగా వరంగల్‌, నిజామాబాద్‌, డోర్నకల్‌, మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్లలో బందోబస్తు పెంచారు. వరంగల్‌, ఖాజీపేట రైల్వే స్టేషన్లలో భాద్రతా ఏర్పాట్లను సీపీ తరుణ్‌ జోషి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రైల్వే అధికారులు హైదరాబాద్‌,సికింద్రాబాద్‌లలో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దుచేశారు. మొత్తం 44 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. అవి లింగంపల్లి-హైదరాబాద్‌-8 సర్వీసులు, హైదరాబాద్‌-లింగంపల్లి-9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి-12 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా-13 సర్వీసులు, ఫలక్‌నుమా-హైదరాబాద్‌-1, రామచంద్రాపురం-ఫలక్‌నుమా-1 సర్వీసు చొప్పున ఉన్నాయి. వీటితోపాటు సికింద్రాబాద్‌-ధన్‌పూర్‌, ఈస్ట్‌కోస్ట్‌ రైళ్లను క్యాన్సల్‌ చేశారు.

ఓ వైపు అగ్నిప‌థ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండగా అగ్నిప‌థ్ స్కీమ్‌పై ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే తాజాగా మరో ప్ర‌క‌ట‌న చేశారు. ఆర్మీ ప‌రీక్ష కోసం సిద్ద‌మ‌వుతున్న యువ‌త‌కు వ‌యోప‌రిమితిని ఒక‌సారి పెంచే అవ‌కాశం కేంద్రం క‌ల్పించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. రిక్రూట్మెంట్ ఏజ్‌ను 23 ఏళ్ల‌కు పెంచిన‌ట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. అయితే రిక్రూట్మెంట్‌కు చెందిన షెడ్యూల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ఆయన తెలిపారు.

- Advertisement -