ఆరు గ్యారెంటీలపై ఖర్గేకు కవిత లేఖ..

24
- Advertisement -

గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలను తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు నమ్మి మీ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి ప్రభుత్వంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ నాడు తెలంగాణ విద్యార్థినుల యొక్క చావులతో సహా అనేక అంశాలను అనవసరంగా రాజకీయం చేసి విద్యార్థుల్లో భయాందోళనను కల్పించి ఓట్లు కూడగట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఓ ప్రత్యేక శైలిని అవలంభించింది. అధికారంలోకి రాగానే ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా వచ్చిన ఆడబిడ్డల హక్కలను తుంగలో తొక్కుతోంది.

1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబరు 41, 56 జారీ అయ్యాయి. దీనికి 1992లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా ఎంతో తోడ్పాటునిచ్చింది. ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారు. మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా అయితే ఉన్నాయో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోంది.

మహిళలకు అవకాశాలు లేక, విద్యా ప్రమాణాలు అందుకోలేక కొన్ని సంవత్సరాల పాటు కోల్పోయినప్పటికీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తోంది. ఇన్నేళ్ల నుంచి సాగుతున్న ఈ పద్ధతిని ఇటీవల రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని తెలంగాణలో మీ గ్యారెంటీతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తూ జీవో 41, 56ను రద్దు చేస్తూ ఈ నెల 10న కొత్తగా జీవో 3ను తీసుకురావడం జరిగింది.

రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా… మేము మహిళల హక్కులను హరించబోమని 2023 జనవరిలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరితో సంప్రదింపులు జరపకుండా మహిళల హక్కులకు భంగం కలిగిస్తూ ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ ను ఉపసంహరించుకుంది. తద్వారా మహిళల హక్కులను సంపూర్ణంగా, శాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్లను కల్పిండానికి జీవో 3ను ప్రభుత్వం జారీ చేసింది. ఇది మహిళల ఉద్యోగావకాశాలకు శరాఘాతంగా నిలవనుంది.

ఉదాహరణకు ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల 50 వేల మంది ఇప్పటికే టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో నమోదు చేసుకున్నారు. అందులో లక్ష మంది ఆడబిడ్డలు ఉన్నారు. ఈ ఏడాది 2 లక్షల కొలువులు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే 33.3 శాతం రిజర్వేషన్ల మేరకు కనీసం 66 వేల మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు కచ్చితంగా రావాలి. అదనంగా మరింత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాలి. అదే ఈ రిజర్వేషన్ల స్పూర్తి. ఈ స్పూర్తిని పక్కనబెడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త జీవో తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మీ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఒక ఆడబిడ్డగా, ఆడబిడ్డల హక్కుల కోసం మాట్లాడేటటువంటి వ్యక్తిగా తెలంగాణలో మీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాను.

ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. సుప్రీం కోర్టు తీర్పును పాటించబోమంటూ బిహార్, కర్నాటక రాష్ట్రాలు జీవోలు జారీ చేశాయి. కానీ తెలంగాణలో మాత్రం మీ గ్యారెంటీతోని ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో తమరు జోక్యం చేసుకొని ఈ జీవోను తక్షణమే వెనక్కి తీసుకునేలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలిపారు.

Also Read:ఇలా చేస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యం.. పదిలం!

- Advertisement -