జర్నలిస్టులు నైతిక విలువలతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి..

88
kavitha
- Advertisement -

తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బేగంపేట్‌ హోటల్‌ ప్లాజాలో జరిగిన రెండు రోజుల మహిళా జర్నలిస్టుల వర్క్‌షాప్‌ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. వర్క్‌షాప్‌లో పాల్గొన్న మహిళా జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాజకీయ బెదిరింపులు, ప్రలోభాలకు తలొగ్గకుండా జర్నలిస్టులు నైతిక విలువలతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని సూచించారు. ‘కోర్‌’ విలువలను పాటించాలన్నారు. ‘కోర్‌’లో ‘సి’ అంటే క్రెడిబిలిటీ (విశ్వసనీయత), ‘ఓ’ అంటే ఆబ్జెక్టివిటీ (విషయం), ‘ఆర్‌’ అంటే రెస్పాన్సిబిలిటీ (బాధ్యత), ‘ఈ’ అంటే ఎథిక్స్‌ (విలువలు) ఉంటేనే వార్తకు సంపూర్ణత చేకూరుతుందని కవిత తెలిపారు.

సీఎంతో సంప్రదించి నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక కేంద్రం కేటాయించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మీడియా సంస్థలలో మహిళలపై వేధింపులు, వివక్షను నిరోధించే కమిటీలను వేయించేందుకు సమాచార కమిషనర్‌తో మాట్లాడుతానన్నారు. మహిళా జర్నలిస్టులు ఎవరైనా న్యాయమైన గొంతుక వినిపిస్తే దాన్ని ఆపడానికి ‘టెక్‌ ఫాక్స్‌’ ద్వారా లక్షల కొద్దీ ట్వీట్స్‌తో అణచివేసే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని కవిత పేర్కొన్నారు.

జర్నలిస్టులకు సంబంధించిన కమిటీలలో మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణకు సూచించారు. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.42 కోట్లు విడుదల చేసిందని ఆమె పేర్కొన్నారు. ఈనిధుల నుంచి వచ్చే వడ్డీతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, పెన్షన్‌ ఇస్తున్నట్టు తెలిపారు. కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 4000 మంది జర్నలిస్టులకు ఆరు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు ఎమ్మెల్సీ కవిత వివరించారు.

- Advertisement -