తెలంగాణకు కేంద్రం ఇచ్చిందో చెప్పాకే అమిత్ షా రాష్ట్రానికి రావాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అమిత్ షాకు ప్రశ్నల వర్షం కురిపించారు.మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలని కోరారు. కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్రప్రభుత్వం కపటత్వం కాదా? అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు. వెనుకబడి ప్రాంతాల అభివృద్ధి గ్రాంటు రూ.1350 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ.2247 కోట్ల జీఎస్టీ పరిహారం సంగతేమిటని కవిత ప్రశ్నించారు. ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐడీ, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో చెప్పాలన్నారు.