గత ఆరేండ్లలో హైదరాబాద్ కు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గాంధీనగర్ డివిజన్ లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, హైదరాబాద్ కు గత ఆరేండ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. వరదలు వస్తే కర్ణాటక రాష్ట్రానికి రూ.600 కోట్ల సాయాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్ కు ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు.
తెలంగాణ వచ్చిన ఆర్నెళ్లలోనే 24 గంటల కరెంటు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. గత ఆరేండ్లలో కేవలం హైదరాబాద్ లోనే రూ. 14 వేల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేశామన్న ఎమ్మెల్సీ కవిత, హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా నిలిపేందుకు ఎంతో కృషి చేశామన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా, హైదరాబాద్ వ్యాప్తంగా 300 బస్తీ దవఖానాలు ఏర్పాటు చేసి, లక్షలాది మంది నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. గత ఆరేండ్లలో రూ.67 వేల కోట్లతో హైదరాబాద్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్న ఎమ్మెల్సీ కవిత, గూగుల్, అమేజన్ లాంటి అగ్ర కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు.
గాంధీనగర్ డివిజన్ లో గత జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామన్న ఎమ్మెల్సీ కవిత, కేవలం అరుంధతి నగర్ లోనే రూ.68 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మించామన్నారు. కరోనా వచ్చినా, వరదలు వచ్చిన ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పోరేటర్ ముఠా పద్మ నరేష్ నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ అండగా ఉన్నారని, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్కడున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు పట్టించుకోకపోవడమేనా బీజేపీ దేశ భక్తి అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. డిసెంబర్ 1 న జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో , కారు గుర్తుకే ఓటేసి, గాంధీ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మ నరేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.