కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన మరుసటి రోజే, డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. మైసూర్ లోని ఒక చిన్న గ్రామం నుండి కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా సిద్ధరామయ్య ఎదిగిన తీరును గుర్తుచేసుకున్నారు. దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు. ఆయన కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశాలను మనం ఎలా ఉపయోగించుకున్నామనేదే నిజంగా ముఖ్యం అని శివకుమార్ రాసుకొచ్చారు.
సిద్ధరామయ్య.. రాజకీయ జీవితం పట్టుదలకు, సామాజిక న్యాయానికి ఒక చిహ్నమని కొనియాడిన శివకుమార్.. ఆయన అందించిన సుదీర్ఘ సేవలకు, సంక్షేమ ఆధారిత పాలనకు కృతజ్ఞతలు తెలిపారు. సిద్ధరామయ్య నాయకత్వంలో ప్రారంభమైన పలు ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కర్ణాటక వృద్ధి చరిత్రలో ఎప్పటికీ ఒక ముఖ్యమైన భాగంగా నిలిచిపోతాయని అన్నారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్న సిద్ధరామయ్య, అందరినీ కలుపుకుపోయే పాలన (ఇంక్లూసివ్ గవర్నెన్స్) ద్వారా రాష్ట్ర రాజకీయ, సామాజిక నిర్మాణాన్ని తీర్చిదిద్దారని శివకుమార్ హైలైట్ చేశారు.
తాను 2020లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తమ మధ్య ఉన్న రాజకీయ బంధాన్ని శివకుమార్ ఈ పోస్ట్‌లో గుర్తుచేసుకున్నారు. 2020లో నాకు కేపీసీసీ అధ్యక్షుడిగా సేవ చేసే బాధ్యత అప్పగించినప్పటి నుండి సిద్ధరామయ్య …నాకు కొండంత అండగా (పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్) నిలిచారు అని ఆయన రాశారు.
సిద్ధరామయ్యతో కలిసి పనిచేయడం ఒక గొప్ప అభ్యసన అనుభవమని (లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్), భవిష్యత్తులో కూడా ఆ సీనియర్ నాయకుడి మార్గదర్శకత్వం తమకు కొనసాగుతుందని డిప్యూటీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక కాంగ్రెస్‌లో ఇంత పెద్ద నాయకత్వ మార్పు జరిగినప్పటికీ, పార్టీలో ఐక్యతను చాటుతూ.. “మీరు వేగంగా నడవాలనుకుంటే ఒంటరిగా నడవండి. కానీ…చాలా దూరం నడవాలనుకుంటే అందరితో కలిసి నడవండి అనే ప్రముఖ సామెతతో శివకుమార్ తన లేఖను ముగించారు.
Also Read:మోదీకి నచ్చిన..’పెద్ది’!

