చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా సెటైర్లు..

18

మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు‌ కుప్పం‌ పర్యటనపై నగిరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో నగిరి‌ ఎమ్మెల్యే ఆర్.కే.రోజా, సినీ గాయనీ ఎస్పి శైలజాలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆర్.కే.రోజా మీడియాతో మాట్లాడుతూ.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా చంద్రబాబు నాయుడు కుప్పం చుట్టూ గిరా గిరా అంటూ తిరుగుతున్నారని రోజా విమర్శించారు.14 సంవత్సరాలు సీఎం చేసిన కుప్పం ప్రజలను అభివృద్ధి చేయాలని చెప్పి ఏనాడైనా చంద్రబాబుకు ఆలోచన వచ్చిందా అంటు ఆమె ప్రశ్నించారు.. కుప్పం ప్రజలకు నీరు ఇవ్వాలని, స్థానికంగా ఇల్లు కట్టుకుని ఒక గర్వంగా ఉండాలని చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదన్నారు. కుప్పంలో ఇల్లు కట్టుకోవాలని చంద్రబాబుకు వచ్చిన ఆలోచన బట్టి అర్థమవుతుందని కుప్పం ప్రజలు చంద్రబాబు విషయంలో ఎటువంటి తీర్పు ఇచ్చారో తెలుస్తుందన్నారు..

నిత్యం జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే చంద్రబాబుకు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు పైన ఉన్న కళ్ళు కిందకి జారిపోయాయి అంటూ రోజా సెటైర్లు వేశారు.. మధ్యంతర ఎన్నికలకు వస్తానంటున్న చంద్రబాబుకు అన్ని ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారన్న తేలిపోయిందని, కానీ కుప్పం ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతున్నారని ఆ విషయం చంద్రబాబు గ్రహించాలన్నారు.. కుప్పంలో చంద్రబాబు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తే ప్రజలు ఏ వైపు ఉన్నారో తెలుస్తుందన్నారు.. రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఉన్నా జగనన్న పెద్దదిక్కుగా మారి ప్రజలను ఆదుకున్నారని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని అన్ని అమలు చేస్తున్నట్లు రోజా వివరించారు..