ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్. సిద్దిపేట పట్టణంలోని కొండ భూదేవి గార్డెన్ లో జరిగిన సిద్దిపేట కో ఆపరేటివ్ సొసైటి అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హరీష్ రావు హాజరయ్యారు. ఈసందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలన్నారు. ఆటో డ్రైవర్లపై సమాజంలో తప్పుడు అభిప్రాయం ఉంది. ఆభావన పోవాలి అంటే మన నడవడికలో మార్పు రావాలన్నారు.
ఆటో డ్రైవర్లు ఫైనాన్స్ ఉచ్చులో పడి అప్పుల పాలు కావద్దు..కో ఆపరేటివ్ సొసైటి ద్వారా స్యయం సమృద్ది సాధించాలని సూచించారు. ఆటో డ్రైవర్లు అందరూ ఒక గ్రూప్ గా ఎర్పడి కొంత డబ్బును బ్యాంక్ లో జమ చేసుకుంటే.. కార్మిక గ్రూప్ కు బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పిస్తామని హామి ఇచ్చారు. ఆటో కార్మికులందరికి 5లక్షల బీమా సౌకర్యం కల్పించే ఏర్పాటు చేస్తామనిచెప్పారు. వృత్తిని నమ్ముకుని జీవించే వారు ఆత్మ గౌరవంతో బ్రతకాలన్నారు.
ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా డ్రైస్ కోడ్ వేసుకోవాలన్నారు. సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ కోసం 300 గజాల స్థలం ఇప్పిస్తానని తెలిపారు. ఆటో కార్మికుల భవన నిర్మాణానికి రూ. 20లక్షలు మంజూరు చేయిస్తానని చెప్పారు. ఆటో డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి..అలాగే గుట్కా, పాన్, సిగరెట్లు మానేయాలన్నారు. ఆటో డ్రైవర్ల జీవితాల్లో వెలుగు నింపేందుకే కో ఆపరేటివ్ సొసైటీ ని ఏర్పాటు చేసామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ కూడా హాజరయ్యారు.