ఉద్యోగ నియామకాల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుతో కలిసి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయంపై పోరాటం చేసి తెలంగాణను తెచ్చుకున్నాం. ఇప్పటికే సాగు, తాగు నీటిని సీఎం కేసీఆర్ పుష్కలంగా అందిస్తున్నారని పేర్కొన్నారు. నిధులు కూడా సమకూర్చుకున్నామని తెలిపారు. పేదరికం లేని రాష్ర్టంగా తెలంగాణ ముందుకెళ్తుంది. నీళ్లు, నిధులు, నియమాకాల్లో జరిగిన అన్యాయాన్ని సీఎం కేసీఆర్ సరిదిద్దుతున్నారు.
రాబోయే రోజుల్లో ఉద్యోగాల భర్తీ ఊపందుకుంటుంది. ఇన్నాళ్లు కేంద్రం నిర్లక్ష్యం వల్లే ఉద్యోగాల భర్తీ ఆలస్యమైంది. 50 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ఆరున్నరేండ్లలో లక్షా 32 వేల ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసింది. టీఎస్ ఐపాస్ ద్వారా ప్రయివేటు రంగంలో లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.